YSR Cheyutha Scheme Amount Not Credited: ఖాతాలో డబ్బు లేకుండా చెక్కు ఇవ్వడం, మోసం చేయడమే! అచ్చంగా ఇలాంటి పనే జగన్ (YS Jagan Mohan Reddy) చేశారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే ‘చేయూత’ పథకం చివరి విడత నిధుల విడుదలకు ఆయన ఉత్తుత్తి బటన్ నొక్కారు. ఈ పథకానికిగాను 5 వేల 60 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఒక్క రూపాయి డబ్బు ఇచ్చేందుకు కూడా ఆర్థికశాఖ నుంచి అనుమతి రాలేదు. ఇది తెలిసీ బహిరంగ సభ పేరిట లబ్ధిదారులను పిలిపించి మరీ వేదికపై నుంచి బటన్ నొక్కారు.
ఇదిగో మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమైపోతాయనేలా కలరింగ్ ఇచ్చారు. గత గురువారం అనకాపల్లి జిల్లా పిసినికాడలో నిర్వహించిన సభలో జగన్ చేసిన ఈ ‘షో’ను రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ (YSRCP) ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ చేయూత లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ కొనసాగిస్తున్నారు. జగన్ బటన్ నొక్కి ఆరు రోజులయినా ఒక్కరికి కూడా బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. ఈ పథకం లబ్ధిదారులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలే. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’ అంటూ వారికే టోకరా ఇచ్చారంటే జగన్ ఎంత గుండెలు తీసిన బంటో ఇట్టే అర్థమైపోతుంది.
వైఎస్సార్ చేయూత - మహిళల ఉపాధి కల్పనపై జగన్ మాటల గారడీ
ఎన్నికల ప్రచారానికి పనికొస్తుందని: చేయూత పథకం కింద లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలలో నిధులు విడుదల చేయనున్నట్లు తొలుత సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి పనికొస్తుందని ఫిబ్రవరిలోనే ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్టు క్షేత్రస్థాయికి సమాచారం పంపారు. ఆ తర్వాత 16కు, 21కి, 26వ తేదీకి ఇలా వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరికి ఈ నెల 7వ తేదీన విడుదల చేశారు. అప్పటికి కూడా నిధుల విడుదల లేకుండానే జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కారు.
చేయూత కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏడాదికి 18 వేల 750 రూపాయల చొప్పున నాలుగు విడతల్లో 75 వేల రూపాయలు అందిస్తామంది. మొదటి రెండు విడతల సందర్భంగా నిర్దేశిత వయసు ఉన్న వారికి సామాజిక భద్రత పెన్షన్ అందుతున్నా చేయూత లబ్ధిని అందిస్తున్నామని సీఎం జగన్ గొప్పలు చెప్పారు. రెండేళ్లుగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసిన ప్రతిసారీ కొత్త దరఖాస్తుదారుల్లో పింఛను పొందుతున్న వారిని పక్కన పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
'నేను బతికే ఉన్నానయ్యా - చనిపోయినట్లు నమోదు చేసి పథకాలు ఆపేశారు'
వారంతా అర్హులు కాదంటూ: గత సంవత్సరం మూడో విడత సందర్భంగా చేసిన ఇలాంటి ప్రయత్నానికి దరఖాస్తుదారుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. తాజాగా నాలుగో విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో ఇప్పటికే పెన్షన్ పొందుతున్న 45 నుంచి 60 ఏళ్లలోపు ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు అర్హులు కాదంటూ పేర్కొన్నారు. ఇలాంటివారు ఏకంగా 50 వేల నుంచి 60 వేల మంది వరకు ఉంటారని తెలుస్తోంది.
సరాసరిన నెలకు 300 యూనిట్లలోపే విద్యుత్తు వాడకం ఉండాలనే నిబంధన కారణంగా చాలా మందికి చేయూత లబ్ధిని నిలిపేశారు. దీంతో గత మూడు విడతల్లో లబ్ధి పొందిన చాలా మంది ఈ టెర్మ్‌లో సాయానికి దూరమయ్యారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపుదారు, వ్యవసాయ భూమి, నాలుగు చక్రాల వాహనం, పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండటం వంటి కారణాలతో వేల మంది అనర్హులుగా మారారు.