YS Sharmila Contest from Kadapa : మా చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్ వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే తాను కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నానని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డితో కలిసి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలు తండ్రి సమాధి వద్ద ఉంచి షర్మిల ఆశీర్వాదం తీసుకున్నారు.
నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని విమర్శించారు. చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారని వైఎస్ షర్మిల ఆరోపించారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారని, వివేకాను చంపించిన అవినాష్‌కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నా వివేకా హంతకులు నేటికీ తప్పించుకొని తిరుగుతున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు నువ్వు నా చెల్లివి కాదు, నా బిడ్డ అన్న జగన్, ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని షర్మిల విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీఎం జగన్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని ఎద్దేవా చేశారు. జగన్ అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. దారుణంగా చిన్నాన వివేకాను చంపితే, గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో మెుదట చూపించారని పేర్కొన్నారు. ప్రజలు హర్షించరని తెలిసి కూడా అవినాష్‌కే, సీఎం జగన్ టికెట్ ఇచ్చారని తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేయాలనేది చిన్నాన్న చివరి కోరిక అని, వివేకా కోరికను నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు.
సునీత న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనికరం లేకుండా, ఆమెపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ బిడ్డగా తాను ఏం చేయాలో ఆలోచించానని, హత్యా రాజకీయాలకు తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాజన్న రాజ్యం తెస్తానన్న జగన్ రాక్షస రాజ్యం తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ నిందితులకు టికెట్ ఇచ్చింది. అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.
నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు. చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు. రాజశేఖరరెడ్డి బిడ్డగా కడప ప్రజల ముందుకు వస్తున్నా. బీజేపీ నేతల కోసం వైసీపీ పని చేసింది. ఒక్క చాన్స్ ఇస్తే , రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. బీజేపీకి వైసీపీ నేతలు బానిసగా మారారు. రాష్ట్రాన్ని గంజాయికి రాజధానిగా మార్చారు. మద్యపాన నిషేధం పేరుతో మహిళలను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలి. -షర్మిల, ఏపీసీసీ చీఫ్