Discharge Petitions in CBI Court: ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. దాదాపు 143 కేసులు తాజాగా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై 258 కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలంగాణ హైకోర్టుకు రిజిస్ట్రీ నివేదిక సమర్పించింది. అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8లో పేర్కొన్న ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం గత ఏడాది నవంబరు 9న సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై తీసుకున్న సుమోటో పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
ప్రస్తుతం కేసుల విచారణ తీరుపై హైకోర్టు రిజిస్ట్రీ నివేదిక సమర్పించింది. ఈ ఏడాది తాజాగా రిజిస్టర్ అయిన 143 కేసులతో సహా పెండింగ్లో 258 కేసులు ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 235 కేసుల్లో సమన్లు జారీ అయినట్లు తెలిపింది. అయితే రెండు కేసుల్లోనే నిందితులను హాజరుపరచడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సమన్లు జారీ అయిన కేసుల్లో నిందితుల హాజరుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
జగన్ అక్రమాస్తుల కేసు- ఆగస్టు రెండో వారానికి వాయిదా వేసిన సుప్రీం - SC ON Jagan Illegal Assets Case
డిశ్ఛార్జి పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించినా: సీబీఐ కోర్టులో పెండింగ్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించినా ప్రయోజనం లేకపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెండింగ్లో ఉన్న 130కు పైగా డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా తీర్పు వెలువడలేదు. డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు పూర్తికాగా తీర్పు వెలువరించాల్సి ఉండగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. గత ఏడాది నవంబరు నుంచి ఒక్కదానిలోనూ తీర్పు వెల్లువడలేదని రిజిస్ట్రీ నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన దర్మాసనం, నేతలపై ఉన్న కేసుల పరిష్కారానికి గతంలో అదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంబంధిత కోర్టులకు పంపాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా చేసింది.
YS JAGAN ILLEGAL ASSETS CASE: మరోవైపు జగన్ అక్రమాస్తులపై విచారణ చేపట్టిన సిబిఐ కోర్టు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తులపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల్లో ప్రధాన నిందితులైన వైఎస్ జగన్, ఇతర నిందితులు దాఖలు చేసిన 134కుపైగా డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. జగన్ తరపు న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి విచారణను 19కు వాయిదా వేశారు.