NEW YEAR CELEBRATIONS PLANNING : కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో యువత వేడుకలకు సిద్ధమైంది. కొన్ని రోజుల ముందు నుంచే పక్కా ప్లానింగ్‌తో సమాయత్తమైంది. ఇప్పటికే కొందరు విందు, వినోదాల్లో తేలిపోతుండగా చాలా మంది అర్ధరాత్రి 12 గంటల వరకు పార్టీలకు ప్లాన్ చేశారు. రాత్రి 12గంటల తర్వాత మిత్రులు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోనున్నారు. అయితే న్యూ ఇయర్ సంబరాలు విషాదం కాకుండా ఉండాలి కుటుంబీకులు, బంధుమిత్రులు కోరుతుంటారు. మరీ ముఖ్యంగా యువత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్కరోజే మిగిలింది అన్నట్లు కాకుండా ఆచీతూచీ వ్యవహరించాలి.
కొత్త ఏడాది వేడుకల ఆనందం అంతా ఇంతా కాదు. డిసెంబర్ 31 రాత్రి ఇచ్చే కిక్ మరే ఇతర పార్టీల్లోనూ ఉండదంటుంటారు. సరిగ్గా అర్ధరాత్రి 12 కాగానే రోడ్లపైకి బైకులపై వచ్చి షికార్లు చేస్తుంటారు. హారన్లు మోగిస్తూ, అతి వేగంగా వెళ్తూ ఆనందాన్ని పంచుకుంటారు. అయితే, వినోదాల వెనుకే విషాదం కూడా పొంచి ఉందనే విషయాన్ని గుర్తించాలి. మీరు ప్రమాదానికి గురికాకుండా మీ స్నేహితులు ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మైనర్లకు బైకులు, కార్లు ఇవ్వొద్దు.
న్యూ ఇయర్ వేడుకలు - మెట్రో వేళలు పొడిగింపు, ఫ్లైఓవర్లు మూసివేత
న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించడం పరిపాటి అయ్యింది. మద్యం తాగడం, ఆ తర్వాత వాహనాన్ని డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉంది. మద్యం మత్తులో వాహన నడిపితే న్యూఇయర్ వేళ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. అందుకే పార్టీ పూర్తయ్యాక రాత్రంతా అక్కడే ఉండి మర్నాడు ఉదయం ఎవరిళ్లకు వారు వెళ్లిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొందరు మద్యం సేవించి నానా హంగామా చేస్తుంటారు. ఇది వారితో పాటు ఇతరులకు కూడా ఇబ్బందిగా మారుతుందని గుర్తుంచుకోవాలి.
కేక్ కటింగ్ తో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కానీ తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని కేకులు కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవు. ఆఫర్లను చూసి మోసపోకుండా తయారీకి వినియోగించిన పదార్థాల గురించి, స్టాకు వివరాలపై ఆరా తీయండి. తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటే కాస్త అనుమానించాల్సిందే అని పలువురు అనుభవపూర్వకంగా చెప్తున్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో మ్యూజిక్ ప్రధానాంశం. మద్యం మత్తులో డీజే పెట్టుకొని నృత్యాలు చేయడం ప్రాణాలకే ప్రమాదం. డీజేల వల్ల అత్యధిక డిసెబుల్స్తో శబ్దం వచ్చి గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీజే శబ్దాల చిన్న పిల్లలకు తోడు మూగ జీవాలు, పెంపుడు జంతువులు తీవ్ర ఇబ్బందుపు పడతాయి. తక్కువ శబ్దంతో ఎక్కువగా ఆనందం పొందే ప్రయత్నం చేయాలి.
కొత్త ఏడాదికి సంతోషంగా జరుపుకొంటారా లేక విషాదం నింపుకొంటారా అనేది మీ చేతుల్లోనే ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. డీజేలకు అనుమతి లేదని, నిర్ణీత సమయంలో మద్యం దుకాణాలు మూసేయాలని స్పష్టం చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడపవద్దని, డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే స్టేషన్‌కు తరలిస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపై కేసులు నమోదు చేస్తామని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని వెల్లడించారు.
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - అద్దిరిపోయే ఈవెంట్స్
'న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి - పరిమితులు దాటితే తప్పదు శిక్ష'