Young Man Attacked Young Woman with Knife: ప్రేమించలేదనే కారణంతో యువతిపై దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో కుళ్లాయప్ప అనే యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతి ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించిన నిందితుడు ఇంట్లోకి చొరబడి ప్రేమించాలని వేధించాడు. యువతి నిరాకరించడంతో కుళ్లాయప్ప తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు యువతిని హుటాహుటిన పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేటు అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమ్మాయి ఒంటిపైన 13 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పులివెందుల నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. బాధిత యువతి డిగ్రీ చదువుతోంది.
కుళ్లాయప్ప అనే యువకుడు గ్రామంలో జులాయిగా తిరుగుతూ ఈ యువతి వెంటపడి ప్రేమించాలని గత కొంతకాలంగా వేధిస్తున్నాడని, అతని ప్రేమను ఆ యువతి చాలాసార్లు తిరస్కరిస్తూ వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రేమించలేదనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కుళ్లాయప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విశాఖలో ప్రేమోన్మాది అరాచకం - యువతిపై రాడ్డుతో దాడి
బ్యాగులో బుల్లెట్లు - విమానాశ్రయానికి విద్యార్థి - ఏం జరిగిందంటే?