YOUNG GIRL DIED IN SURYAPET : సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి తట్టుకోలేక 14 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక మృతిని చూసిన దుండగులు, ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యను అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కాసం సోమయ్య, నాగయ్య, కాసం లింగం అనే వ్యక్తులు పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
పథకం ప్రకారం కర్రలతో, ఇనుప రాడ్డుతో సోమయ్య ఇంటిపై దాడి చేసి, అతడిని, అతడి భార్యను విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపర్చారు. అదే సమయంలో ఇంట్లో అనారోగ్యంతో ఉన్న సోమయ్య కుమార్తె కాసం పావని (14) తన తల్లిదండ్రులపై దాడి చేస్తున్న దృశ్యాలను చూసింది. తన తల్లిదండ్రులను చంపుతున్నారనే భయాందోళనకు గురై, కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బాలిక మృతి చెందిన విషయాన్ని గమనించిన దాయాదులు, అక్కడి నుంచి పరారయ్యారు.
అనంతరం తన కుమార్తె మృతికి తనపై దాడి చేసిన వారే కారణమంటూ సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.