Yeleru Canal Floods in Kakinada District: ఏలేరు నుంచి వస్తున్న వరద కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరద ఉద్ధృతికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు కత్తిపూడి - కాకినాడ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాపత్తిలోని గొర్రె కండి కాలువ వద్ద నీటి ప్రవాహం చూసేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు వరదలో చిక్కుకున్నారు. ఒకరినొకరు పట్టుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేరారు.
రెండ్రోజుల క్రితం ఏలేరు నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు నీటిమునిగాయి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో రోడ్లన్నీ కాలువల్లా మారాయి. జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి కారణంగా వాహన రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. గొల్లప్రోలులో పంటలు దెబ్బతిన్నాయి. జగనన్న కాలనీ, సురంపేట కాలనీలను వరద చుట్టుముట్టింది. స్థానికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు పడవలను ఏర్పాటు చేశారు.
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన: ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పర్యటించారు. యర్రవరం గ్రామంలో నీట మునిగిన ప్రాంత, అప్పన్నపాలెం కాజ్వే, ఏలేరు జలాశయం, తిమ్మరాజు చెరువును ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. అప్పనపాలెం వంతెన పైభాగం నుంచి పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమతంగా ఉండాలని ఆమె సూచించారు. అనంతరం ప్రత్తిపాడు వాగులు, కాలువలు పొంగుతున్న నేపథ్యంలో అధికారులు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
మోకాళ్ల లోతుపైగా నీళ్లు: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంను బురద కాలువ వరద చుట్టుముట్టింది. బురద కాలువ ఉదృతంగా పెరిగడంతో కాలువకు మరో రెండు గండ్లు పడ్డాయి. రోడ్లపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద వల్ల పలు ప్రాంతాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో ఇళ్ల మధ్యలో మోకాళ్ల లోతుపైగా నీళ్లు చేరాయి. ఈ క్రమంలో వరద ప్రవాహం రాత్రి సమయంలో మరింత పెరిగితే తమ పరిస్థితి ఏంటంటూ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.