YCP Leaders Joined TDP in Presence of Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో మంగళగిరికి చెందిన 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారందరికి లోకేశ్ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ మంగళగిరిని గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్ది, స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ క్లస్టర్‌ని ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 29 రకాల సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళగిరికి పెద్దఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు.
నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు
వైసీపీ హయాంలో మంగళగిరి అభివృద్ధికి నోచుకోలేదు: వైసీపీ ప్రభుత్వ నిర్వాకం, వేధింపులు, సహాయ నిరాకరణతో అవన్నీ తరలిపోయాయన్నారు. సమర్థుడైన శాసనసభ్యుడు లేకపోవడంతో రాష్ట్రం నడిబొడ్డున ఉన్నా గత పదేళ్లుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ.2 వేల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. కృష్ణా నది పక్కనే ఉన్నా నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగు నీరు అందించలేకపోయారని దుయ్యబట్టారు.తాగునీటి సమస్య పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పైప్‌లైన్ పనుల్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిపి వేసిందని మండిపడ్డారు. రెండు నెలలు ఓపిక పట్టండి మా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే మంగళగిరి పరిధిలో అన్ని ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హమీ ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు.
బడుగులను గుమ్మం బయటే నుంచో బెట్టడమేనా జగన్ చేసే సామాజిక న్యాయం: నారా లోకేశ్
రచ్చబండలో నారా లోకేశ్ ముఖాముఖి: రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ్ దుగ్గిరాల మండలం చింతలపూడి, మంచికలపూడి, కంఠంరాజు కొండూరు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. తమకు కమ్యూనిటీ హాలు లేదని గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చారని వారు లోకేశ్‌కు విన్నవించుకున్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్కే నియోజకవర్గంలో రోడ్లు వేయలేకపోయారని ప్రజలు విమర్శలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో లోకేశ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పెదవడ్లపూడి ఉన్నత వాహిని కాలువ పూర్తి కాకపోవడం వల్ల రైతులు అల్లాడిపోతున్నారని స్థానిక టీడీపీ నేతలు వివరించారు. మంచికలపూడిలో ఇద్దరు మహిళలు, కంఠంరాజు కొండూరులో తాడిబోయిన శాంతి అనే మహిళ తాము లోకేశ్ రూపొందించిన స్త్రీ శక్తి ద్వారా పైసా ఖర్చు లేకుండా కుట్టు మిషన్లు నేర్చుకుని ఏ విధంగా నైపుణ్యం సాధించారో వివరించారు.