YCP Government Neglected Tidco Houses: టిడ్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. సొంతింటి కల సాకారమైందని గంపెడాశలతో టిడ్కో గృహాల్లోకి వెళ్లిన లబ్ధిదారులను సమస్యలు చుట్టుముట్టాయి. ఇళ్ల తాళాలు ఇచ్చిన అధికారులు వసతులు మాత్రం కల్పించలేదు. మొక్కుబడిగా ప్రారంభోత్సవాలు చేయించి తమ పని అయిపోయిందంటూ నేతలు చేతులు దులుపుకున్నారు. నీటి కొరత, అస్తవ్యస్త డ్రైనేజీ, కరెంట్ కోతలు ఇలా టిడ్కో గృహాల్లో లబ్ధిదారులు సమస్యలతో సావాసం చేస్తున్నారు.
ఐదేళ్లలో వ్యవస్థల విధ్వంసం - ఊరూరా వైఎస్సార్సీపీ నేతల అరాచకం - YCP Irregularities
తెలుగుదేశం హయాంలో టిడ్కో ఇళ్లను (Tidco Houses) 90 శాతం పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడమే లబ్ధిదారులకు శాపంగా మారింది. అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్ టిడ్కో ఇళ్లపై శీతకన్నువేసింది. మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసేందుకు నాలుగేళ్ల సమయం తీసుకుంది. ఎన్నికలకు ఏడాది ముందు వాటిని తూతూమంత్రంగా పూర్తిచేసి మమ అనిపించింది. ప్రతిపక్షాల ఒత్తిడితో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో ఏడాది కిందట టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. హడావుడిగా లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు.
టిడ్కో గృహ సముదాయాల నిర్వహణను అధికారులు పూర్తిగా గాలికొదిలేశారు. ఏడాది దాటినా కనీస వసతులపై దృష్టి పెట్టలేదు. కావలి మద్దూరుపాడు వద్ద 2,112 ఇళ్లు పూర్తి చేస్తే 1,812 మందికి తాళాలు ఇచ్చారు. వసతులు లేక 200 మంది మాత్రమే అక్కడ నివాసం ఉంటున్నారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలో 4800 ఇళ్లు పూర్తి చేస్తే 3750 మందికి ఏడాది కిందట తాళాలు ఇచ్చారు. వసతులు లేక 1500 మంది మాత్రమే నివాసాలు ఉంటున్నారు. కందుకూరులో 1408 ఇళ్లు పూర్తి చేశారు. 1173 మందికి ఇళ్లు కేటాయించగా సమస్యలు ఉండటంతో 400 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. సమస్యలు ఉన్నా ఆర్థిక పరిస్థితులు కారణంగా తప్పని పరిస్థితుల్లో కొందరు ఆ ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు.
టిడ్కో గృహ సముదాయాలను పట్టించుకోకపోవడంతో దారుణంగా మారాయి. అస్తవ్యస్త డ్రైనేజీతో దుర్వాసన వెదజల్లుతోంది. నాసిరక నిర్మాణంతో ఇళ్లకు అప్పుడే లీకేజీలు వస్తున్నాయి. దోమలు, పాములు, కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. నీరు సక్రమంగా రాదు. వీధి లైట్లు వెలగవు. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు పోతుందో తెలియదు. చంటిబిడ్డలతో ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు వెంకటేశ్వరపురం ఇళ్లలో మురుగునీరు పోకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని, సమస్యలు పరిష్కారించడానికి ఐదేళ్లు నుంచి ఎవరు రాలేదని విమర్శిస్తున్నారు.