WORLD BANK LOAN FOR AMARAVATI: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతికి మంచి రోజులు నడుస్తున్నాయి. అమరావతికి ఇప్పటికే 6 వేల 700 కోట్ల రుణాన్ని ఏడీబీ మంజూరు చేయగా, తాజాగా ప్రపంచ బ్యాంకు కూడా రాజధాని నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతికి 6 వేల 800 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటన చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల (ASIAN DEVELOPMENT BANK) ద్వారా నిధులు సమకూరుస్తామని చెప్పింది. ఈ 2 సంస్థల ద్వారా 13 వేల 500 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుతామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది.
అమరావతి అద్భుతమైన మోడల్ : అమరావతి సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి మద్దతిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. దేశంలో 2050 నాటికి పట్టణ జనాభా 95 కోట్లకు చేరుతుందని, పట్టణ పరివర్తనకు అమరావతి అద్భుతమైన మోడల్ అని కొనియాడింది. ప్రపంచ నైపుణ్యాన్ని అమరావతికి తీసుకొస్తున్నామన్న ప్రపంచ బ్యాంకు, ప్రస్తుతం అమరావతిలో సుమారు లక్ష మంది నివసిస్తున్నారని తెలిపింది. వచ్చే దశాబ్దంలోపు అమరావతిలో జనాభా అనేక రెట్లు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు: 2050 నాటికి అమరావతిలో 35 లక్షల మందికి వసతి కల్పించేలా ప్రణాళిక రూపొందించారని, 217 చ.కి.మీ విస్తీర్ణంలో ప్రభుత్వం మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపింది. ప్రాజెక్టు భాగస్వాములతో విస్తృత ప్రయత్నాలు చేస్తామన్న ప్రపంచబ్యాంకు, అమరావతిలో 22 శాతం సరసమైన గృహాల కోసం రిజర్వ్ చేశారని గుర్తు చేసింది. అమరావతిలో వచ్చే ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని పేర్కొంది.
The World Bank’s Board of Executive Directors yesterday approved the $800 million #Amaravati Integrated Urban Development Program aimed at establishing the city as a well-managed, climate-resilient growth center in #AndhraPradesh that generates jobs and improves the lives of its…
— World Bank India (@WorldBankIndia) December 20, 2024
అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని అందిస్తాం: 17 వేల మంది వ్యక్తులకు నేరుగా శిక్షణ ఇస్తుందని, అందులో 10 వేల మంది మహిళలు, మెరుగైన, అధిక జీతాలతో ఉద్యోగాలకు వారి జీవన విధానం మెరుగవుతుందని ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది. రోడ్డు గ్రిడ్, ప్రజా రవాణా, వరదల నుంచి ఉపశమనం, నీరు, వ్యర్థజలాల వ్యవస్థలతో నగరానికి అవసరమైన కీలక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని ప్రపంచబ్యాంకే అందిస్తుందని ప్రకటించింది.
తక్కువ కార్బన్‌తో ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ఉపయోగించడంతో సహా వాతావరణ ప్రభావాలకు నగరాన్ని మరింత స్థితి స్థాపకంగా మార్చడానికి స్మార్ట్, గ్రీన్ టెక్నాలజీ, డిజైన్ విధానాలను ప్రభుత్వం తీసుకువస్తుందని పేర్కొంది. విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని ప్రపంచ బ్యాంకు ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత 800 మిలియన్ల డాలర్ల రుణం 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌తో సహా 29 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ కరెన్సీ.. 'యెన్'లో రుణాన్ని పొందాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రపంచబ్యాంకు వెల్లడించింది.
శరవేగంగా రాజధాని పనులు: కూటని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 33 వేల 137.98 కోట్ల రూపాయలతో 45 ఇంజినీరింగ్ పనుల్ని చేపట్టేందుకు సీఆర్డీఏకి (Capital Region Development Authority) అనుమతిచ్చింది. ఐఏఎస్, గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు.
మూడేళ్లలో అమరావతి పూర్తి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతికి హడ్కో ద్వారా 11 వేల కోట్ల రూపాయలు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి 5 వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి సీఆర్‌డీఏకి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాజధాని అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొద్ది రోజుల క్రితమే తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే జనవరికి 62 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తామని తెలిపారు.
మూడేళ్లలో రాజధాని పూర్తి - గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు : మంత్రి నారాయణ