Workshop on Jal jeevan Mission: రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్‌ను మరింత బలోపేతం చేస్తామని, అమృతధార పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా రక్షిత తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి వ్యక్తికీ రోజుకు సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కల అని, నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో ప్రారంభించారని గుర్తు చేశారు.
ఈ పథకాన్ని గత ప్రభుత్వం తమ వాటా నిధులు జమ చేయకుండా నాలుగు వేల కోట్ల రూపాయలు వృథా చేసిందని ఆవేదన చెందారు. రాష్ట్రానికి 76 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతోపాటు గడువు పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రికి విజ్ఞప్తి చేశామని అన్నారు. ఇంజనీరింగ్ లోపాలను అధిగమించి ఉద్యోగులే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఈ పథకం సక్రమంగా అమలయ్యేలా అంతా సహకరించాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారుల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
విజయవాడలో గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులతో జలజీవన్ మిషన్ కార్యక్రమం అమలుకు రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న రక్షిత మంచినీటి పథకాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేందుకు, ప్రజలకు సురక్షిత నీరు అందేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రంగంలో పనిచేస్తోన్న ప్రముఖ ప్రయివేటు కంపెనీలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ కల్యాణ్‌తోపాటు అధికారులు తిలకించారు. అనంతరం రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో జలజీవన్ మిషన్ పునరుద్ధరణపై ఉపముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ - ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు
నిధులను సద్వినియోగం చేసుకోలేదు: 2019 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభమైనప్పటికీ, రాష్ట్రంలో రెండేళ్లు ఆలస్యంగా కార్యకలాపాలు మొదలయ్యాయని అన్నారు. ఉన్నత ఆశయంతో మొదలైన ఈ పథకాన్ని రాష్ట్రంలో గత ప్రభుత్వం సక్రమంగా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని ఆవేదన చెందారు. జనాభా ప్రకారం మన కంటే చిన్నదైన కేరళ రాష్ట్రం 45 వేల కోట్ల రూపాయల వరకు అడిగితే, మన రాష్ట్రం కేవలం 26 వేల కోట్ల రూపాయల నిధులకే ప్రతిపాదనలు పంపించిందని మండిపడ్డారు. దీనికి కూడా రాష్ట్ర వాటా నిధులను జమ చేయలేకపోయిందన్నారు.
రూ.4 వేల కోట్లు దుర్వినియోగం: సరైన నీటివనరులను ఎంపిక చేయలేదని, చాలా చోట్ల పైపులు వేసి వదిలేశారని, అనేక లోపాలతో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను వృథా చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జలజీవన్ మిషన్ పనులపై మూడు వారాలపాటు క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తే అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. రిజర్వాయర్ల నుంచి నీరు తీసుకోవాలని చెప్పినా అలా చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేశారని ఆరోపించారు.
ఏపీకి రూ.76 వేల కోట్లు కోరాం: అమృతధార పేరిట రాష్ట్రంలో జలజీవన్ మిషన్ పునరుద్ధరణ కోసం గడువు పెంచాలని కోరడమే కాకుండా 75 వేల కోట్ల రూపాయల వరకు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు విజ్ఞప్తి చేశానని పవన్ కల్యాణ్ తెలిపారు. సమగ్ర నివేదికను జనవరి నెలాఖరుకు కొత్త ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ప్రస్తుతం పనుల డిజైనింగ్‌లో చాలా లోపాలున్నాయని, ఇంజనీర్ల ఆలోచన ధోరణిలోను మార్పులు రావాలని ఆకాంక్షించారు. కోటి మంది ప్రజలకు రక్షిత తాగునీరు అందించాలని ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
జలజీవన్ మిషన్ అమలులో లోపాలను గుర్తించామని, వాటిని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తెలిపారు. ఏ హోదాలో ఉన్నప్పటికీ జిల్లా RWS అధికారిగా ఉన్న వ్యక్తి జలజీవన్‌మిషన్ కార్యకలాపాల లక్ష్యానికి అనుగుణంగా పూర్తి బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా అన్ని ఇళ్లకు కొళాయిల ద్వారా నీరు ఇవ్వలేకపోయామని అన్నారు.
జలవనరుల నుంచి నీరు తీసుకుని రిజర్వాయర్లకు ఇస్తే జలజీవన్ మిషన్ లక్ష్యం నెరవేరుతుందని, ఇందుకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామని నీటిపారుదలశాఖ సలహాదారు వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి హాజరైన అధికారులు తమ జిల్లాల పరిధిలోని సుస్థిర నీటివనరుల వివరాలను ఈ వర్క్‌షాప్‌లో ఉన్నతాధికారుల ముందుంచారు.
'జలజీవన్'పై అధికారుల మొద్దునిద్ర - కొత్త డీపీఆర్‌లు రూపొదించడంలో జాప్యం