Mercedes Benz sales in Telangana : దేశంలో లగ్జరీ కార్లు కొంటున్న యువత సంఖ్య పెరుగుతోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. వీరిలో బెంజ్ కార్లను కొనుగోలు చేస్తున్న వారిలో 15% మంది మహిళలే అని శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ కారు విక్రయాల్లో ఈ సంవత్సరం రెండంకెల వృద్ధి సాధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు.
2024 ప్రథమార్థంలో 9,262 కార్లు విక్రయించామని, గత ఏడాదితో పోలిస్తే వీటి సంఖ్య 9% అధికమని సంతోష్ అయ్యర్ తెలిపారు. ఈ సంవత్సరం విడుదల చేసిన 11 మోడళ్లలో 3 విద్యుత్ కార్లు ఉన్నాయన్నారు. రాబోయే అక్టోబర్ నెలలో బెంజ్ నుంచి మరో మోడల్ ఆవిష్కరిస్తామని వివరించారు. మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా గతేడాది 2.5% అయితే, ఈ ఏడాది 5 శాతానికి చేరినట్లు వివరించారు.
సాంకేతికత అభివృద్ధి, ఇతర అవసరాల కోసం ఈ ఏడాదిలో పెట్టిన రూ.200 కోట్లతో కలిపి మొత్తం పెట్టుబడులు రూ.3,000 కోట్లకు చేరినట్లు వివరించారు. భారత్‌లో విక్రయిస్తున్న బెండ్ కార్లలో 95% ఇక్కడే తయారవుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా తీసుకొచ్చిన బెంజ్ ఈక్యూఎస్ ఎస్‌యూవీ 580 4 మేటిక్‌ను దేశంలోనే తయారు చేస్తునట్లు పేర్కొన్నారు. పూర్తిగా తయారైన కారు యూనిట్లతో (సీబీయూ) పోలిస్తే, ఇక్కడే తయారైన వాటికి ధర తక్కువగా ఉంటుందన్నారు.
తెలంగాణ వాటా 9% : బెంజ్ కార్లకు తెలంగాణలో మంచి గిరాకీ ఉంటోందని సంతోష్ అయ్యర్ తెలిపారు. దేశంలో తమ కంపెనీ మొత్తం విక్రయాల్లో ఇక్కడి వాటా 8-9 శాతమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 1% వాటా ఉందని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా భాగ్యనగరంలో మేబ్యాక్ లాంజ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లగ్జరీ కార్ల కొనుగోలుదార్లకు సరికొత్త అనుభవం అందించడమే దీని లక్ష్యమన్నారు. దేశంలో బెంజ్ అతిపెద్ద సర్వీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రెండో సర్వీస్ స్టేషన్‌నూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు.
మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలా? టాప్-5 మోడల్స్ ఇవే! - Best Family Cars