Wildlife Animals Hunters Arrested in Satya Sai District : అంతరించిపోతున్న జాబితాలో చేరిన వన్యప్రాణులకు రక్షణ కరవైంది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు, అధికారులు ఎంత కృషి చేస్తున్నా ఎక్కడో చోట అక్రమాలు జరుగుతునే ఉన్నాయి. అధికారుల కళ్లు కప్పి అంతరించిపోతున్న వన్యప్రాణులను స్మగ్లర్లు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా వన్యప్రాణిని అక్రమంగా తరలిస్తున్న ముఠాని సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి అలుగును బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుళ్ల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
ఓ వాహనంలో 12 కిలోల బరువు ఉన్న అలుగును అధికారులు గుర్తించారు. అక్రమాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని అలుగును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన ఇద్దరు, పుట్టపర్తి చెందిన ఒకరు, అన్నమయ్య జిల్లా మదనపల్లి చెందిన ఒకరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
అభయారణ్యాలపై కన్ను - ఎర్రచందనంతో పాటు వన్యప్రాణులు స్మగ్లింగ్
అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ : ఇటీవల బద్వేల్ అటవీ శాఖ పరిధిలోని బోయినపల్లి బీట్‌లో అలుగుతో పాటు ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలిస్తున్న స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల విలువ ఉంటుందని ప్రచారంలో ఉన్న నేపథ్యంలో స్మగ్లర్లు ఈ జీవులపై టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో అలుగు దాదాపు రూ.80 లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతుందని, చైనా, ఇతర దేశాలలో ఔషధ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగిస్తారనీ ప్రచారం. కాగా, ఆభరణాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాలెట్ల తయారీకి ఉపయోగిస్తారని అటవీ అధికారులు చెబుతున్నారు.
హాని తలపెడితే శిక్ష తప్పదు : వన్యప్రాణి సంరణక్ష చట్టం-1972 ప్రకారం కఠిన శిక్షలు ఉన్నాయి. పులిని ఆటపట్టించినా భయపెట్టినా ఆరు నెలలు శిక్ష పడుతుంది.
- పులి, అలుగు, ఇతర షెడ్యూల్-1లో పరిధిలోని ప్రాణులను వేటాడితే నాన్‌బెయిలబుల్ కేసు నమోదవుతుంది. 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా పడుతుంది. రెండోసారి కూడా అదే తప్పుచేస్తే రూ.25 వేల జరిమానా 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష.
- పులి ఉండే అభయారణ్యంలోని కోర్ ఏరియాల్లో వేటాడితే 3 నుంచి ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా ఉంటుంది.
- రెండు అంతకంటే ఎక్కువసార్లు వేటాడితే రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
- పులిని వేటాడినట్లు సరైన ఆధారాలుంటే నిందితులను వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు.
ఒంటెలు అక్రమ రవాణా- అన్నమయ్య జిల్లాలో నిందితులు అరెస్ట్ - Camel Smuggling Gang Arrested