Next DGP in Andhra Pradesh 2024 : ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఏపీ నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. కొత్త డీజీపీ నియామకం కోసం వీరి ముగ్గురి పేర్లు ప్యానల్ జాబితాలో పంపించే అవకాశం ఉంది. వీరు ముగ్గురిలో ఎవరినైనా వద్దనుకుంటే హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్‌కుమార్ గుప్తా పేరు జాబితాలో చేరొచ్చు.
Election Commission Transferred AP DGP : ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రాజేంద్రనాథరెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగవని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదులపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికల్లో వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది.
సీనియర్ అధికారులను పక్కన పెట్టి మరీ : సీఎం జగన్ డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి మరీ 2020 ఫిబ్రవరి 15న కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇంఛార్జ్ డీజీపీగా నియమించారు. రెండేళ్ల రెండు నెలలుగా ఆయణ్ను అదే హోదాలో కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపికకు అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోం శాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. ఈ నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆదేశాలను పట్టించుకోలేదు. రాజేంద్రనాథరెడ్డి ‘తమవాడు’ కావటమే ఏకైక అర్హతగా సీనియార్టీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే ఆయనను డీజీపీగా నియమించారు.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు - Election Commission Transfer AP DGP