West Godavari Combined with Spiritual Temples And Tourist Spots : గోదారి గలగలలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలతో శోభిల్లే ఉమ్మడి పశ్చిమ గోదావరి రాష్ట్రంలోనే ప్రత్యేకమైన ప్రాంతం. భక్తులకు కార్తిక మాసం పరమ పవిత్రమైనది కాగా, పర్యాటకులకు కూడా అనువైనది. కార్తికం నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమలో దేవాదాయశాఖతోపాటు పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు, భద్రత చర్యలు తీసుకుంటోంది.
పాపికొండల యాత్ర : పోలవరం నుంచి పేరంటాళ్లపల్లి వరకు పాపికొండల మధ్య నుంచి సాగే బోటు షికారు పర్యాటకులకు కనువిందు కలిగిస్తుంది. మార్గం మధ్యలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును వీక్షించే అవకాశం ఉంది.
పంచారామ క్షేత్రాలు : పంచారామ క్షేత్రాలైన భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాలు ఈ జిల్లాల్లోనే కొలువై ఉన్నాయి.
పెనుగొండలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, వాసవీశాంతిధాంలో 90 అడుగుల కన్యకాపరమేశ్వరి పంచలోహ విగ్రహాన్ని భక్తులు దర్శిస్తుంటారు.
బందీపూర్ తరహాలో చిత్తూరులో జాతీయ పార్కు - కేంద్రానికి ప్రతిపాదనలు
పట్టిసం : అఖండ గోదావరి మధ్యలో భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆధ్యాత్మికంగానే కాక పర్యాటకంగానూ ఇది అందమైన ప్రదేశం.
చిన తిరుపతి : ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు.
మద్ది ఆంజనేయస్వామి : జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మద్ది క్షేత్రంలో స్వయంభువుడై ఆంజనేయస్వామి మద్ది చెట్టు తొర్రలో దర్శనం ఇస్తారు. కార్తిక మాసంలో నెల రోజులు ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.
బౌద్ధారామాలు : ఏలూరు జిల్లా కామవరపుకోటలోని గుంటుపల్లి బౌద్ధ క్షేత్రనిధి. క్రీస్తు పూర్వం 326లో మహానాగుడు అనే బౌద్ధ సన్యాసి ఈ పర్వతంపై విశ్వవిద్యాలయం నిర్వహించారు. బౌద్ధ గుహలు, బౌద్ధారామాలు కొలువై ఉన్నాయి.
కనువిందు : 216ఏ జాతీయ రహదారి సిద్ధాంతం నుంచి నరసాపురం వరకు విస్తరించిన గోదావరి, పేరుపాలెం సముద్ర తీరం కార్తికంలో కనువిందు చేస్తాయి. తీరం పొడవునా నది మధ్య లంకల్లో పచ్చదనం, ఇసుకతిన్నెలు, కొబ్బరి తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వనసమారాధనల పేరిట లక్షలాది మంది పర్యాటకులు, భక్తుల రాకతో నెలంతా సందడిగా ఉంటుంది.
నాగార్జునసాగర్-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే