Wedding Business In Telangana : హైదరాబాద్‌లో పెళ్లి సందడి మొదలైంది. మూడు మాసాల పాటు మంచి ముహూర్తాలే ఉండటంతో పెళ్లి వేదికల బుకింగ్, కేటరింగ్, దుస్తులు, బంగారం కొనుగోళ్లతో వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. వివాహమనేది జీవితంలో మరుపురాని ఓ మధుర ఘట్టం కావడంతో కలకాలం గుర్తుండిపోయేలా అందరూ గుర్తుంచుకొనేలా చేయాలనుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా. వీటి కోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తన సర్వేలో వెల్లడించింది. ఇందులోని వివరాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ సీజన్‌లో 5 వేల పెళ్లిళ్లు జరుగుతుండగా 625 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరగనుంది.
నిశ్చితార్థం మొదలుకొని ముగిసే వరకు : పెళ్లిళ్ల ఖర్చులను ఇరు వర్గాల వారు సగం సగమంటూ ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇలా 59శాతం మ్యారేజీలలో జరుగుతోందని ‘వెడ్ మి గుడ్’ అనే సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. 32శాతం మంది సొంతంగానే ఖర్చులను భరిస్తుస్తున్నట్టుగా వెల్లడించింది. పెళ్లి నిశ్చితార్థం నుంచి మొదలుకొని వివాహ తంతు ముగిసే వరకు డెకరేషన్ చేసేవాళ్లు, డీజే సంగీతం, బ్యాండ్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, శామియానా, పురోహితులు, కేటరింగ్, పత్రికలు, దుస్తులు, బంగారం కొనుగోళ్లు, మేకప్, మెహందీ ఆర్టిస్టులు ఇలా చాలా మందికి ఉపాధి దొరుకుతోంది.
పెళ్లికి అయ్యే ఖర్చు వేరీ కాస్ట్లీ : గతంతో పోల్చితే వివిధ విభాగాల్లో ఖర్చులు పెరిగాయి. పెళ్లిమండపంల ఖర్చు గతంలో రూ.50వేల నుంచి రూ.7-8లక్షల వరకు ఉండగా ప్రస్తుతం రూ.75వేల నుంచి రూ.10లక్షలకు పెరిగింది. ప్లేటు భోజనానికి వెచ్చించే ఖర్చు గతంలో రూ450 - రూ.1000 ఉంటే అది రూ.700 - రూ.1500 వరకు పెరిగింది. కూరగాయలు, నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఖర్చు పెరిగిందని కేటరింగ్ సేవల ప్రతినిధులు తెలిపారు.
భోజనం ‘ఆహా’ అనిపించేలా : భోజనాల్లో కనీసం 15 నుంచి 20 రకాలు వంటకాలు అందుబాటులో ఉండాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగానే కేటరింగ్ సర్వీసుల వాళ్లు ఇరువర్గాలకు సంబంధించి ఐదు నుంచి పది మందిని పిలిచి వేర్వేరు వంటకాలను అప్పటికప్పుడు వండి రుచి చూపిస్తున్నారు. శాకాహారంలో ఉత్తర, దక్షిణ భారతదేశ వంటకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
పెళ్లి కాస్త వెరైటీగా ఉండే విధంగా : వెజ్ స్టార్టర్లలో పనీర్, మంచూరియా ఉండాలని కోరుతున్నారు, వెజ్ బిర్యానీ, బొబ్బట్లు, పనీర్ కూర, మూడు పచ్చళ్లు, ఇతర కూరగాయలు, ఉలవచారు, సాంబార్, రైతా, ఐస్‌క్రీమ్, ఖద్దూ కా కీర్, రెండు నుంచి మూడు పొడులు, గులాబ్ జామూన్, ఖుబానీ కా మీఠా, వీటితో పాటు పానీపూరీ, ఇడ్లీ, దోశ వంటి బ్రేక్‌ఫాస్ట్ ఉండాలని కోరుతున్నారు. మాంసాహారంలో మటన్, చికెన్, చేపలు, రొయ్యలతో చేసిన 3 నుంచి 4 వెరైటీలు ఉండే విధంగా చూసుకుంటున్నారు.