Waves Raising At Konaseema sea : ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం రాత్రి నుంచి తీరం వెంబడి అలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. తీరం వెంబడి కడలి సుమారు అర కిలోమీటరు మేర చొచ్చుకొచ్చింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సంద్రం పోటెత్తింది. గోదావరి సంగమం, బీచ్ రోడ్డులో అలల ఉద్ధృతి పెరిగింది.
దీంతో పల్లిపాలెంలో ఇళ్లల్లోకి నీరు చేరింది. మలికిపురం మండలం కేశవదాసుపాలెం, చింతలమమోరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లోకి ఉప్పునీరు చేరింది. తీరంలోని రొయ్యల చెరువులు నీట మునిగాయి. మామిడికుదురు మండలం కరవాక తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. అల్లవరం మండలం ఓడలరేవులో కడలి అల్లకల్లోలంగా ఉంది. ఓఎన్జీసీ టెర్మినల్‌ను సముద్రపు నీరు ముంచేసింది. పలు ఆక్వా చెరువులు కొట్టుకుపోయాయి.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు : వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పలుచోట్ల జనజీవనం స్తంభించింది. విశాఖ, కాకినాడ సముద్ర తీరంలో పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద సముద్రపు అలలు షాప్‌లను తాకుతున్నాయి. వర్షాల ప్రభావానికి పెదగంట్యాడ మండలం కొంగపాలెంలో రేకుల షెడ్డు కూలడం వల్ల ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.
కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు నేల కూలాయి. అంతర్వేది తీరంలో సముద్రం కల్లోలంగా మారింది. మరోవైపు గోదావరి సంగమం వద్ద కూడా పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష : ఆంధ్రప్రదేశ్‌లో భారీవర్షాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు సీఎంకు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడ్డాయని నివేదించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు. చెరువులు, వాగుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను అధికారులు సీఎంకి వివరించారు.
తుపాన్లకు పేర్లు ఎవరు, ఎలా పెడతారు? - వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
వాయుగుండం ఎఫెక్ట్ - విశాఖ, కాకినాడ సముద్ర తీరాలు అల్లకల్లోలం