Water Crisis In Telangana 2024 : రాష్ట్రంలో నీటి వినియోగం 50 రోజులుగా భారీగా పెరిగింది. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్ల ద్వారా నీటిని తోడుతున్నారు. పశుగ్రాసానికి, తాగు నీటికి, కోళ్లఫారాల్లోనూ నీటి వినియోగం పెరిగింది. కృష్ణా పరీవాహకంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి జూరాలకు 154 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశైలానికి 115 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నారాయణపూర్ నుంచి కనీసం ఐదు టీఎంసీలు దిగువకు విడుదల చేయాలని కర్ణాటకను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Water Problem in Telangana : నారాయణపూర్‌లో 20 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జూరాల కింద తాగునీటి అవసరాలకు ముందుగా నీటిని కోరే అవకాశాలు ఉన్నట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. జూరాల జలాశయంలో 50 రోజుల వ్యవధిలో 1.85 టీఎంసీల వినియోగం నమోదైంది. ఈ జలాశయం వేగంగా అడుగంటుతోంది. జూరాల కింద పంటలు సాగు చేసిన రైతులు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం అనంతరం జూరాలకు ఏటా కనీసం రెండున్నర టీఎంసీలు ఎగువనున్న కర్ణాటక నుంచి వచ్చేవి. ఈ ఏడాది చుక్కనీరు కూడా రాలేదని రైతులు చెబుతున్నారు. బీమా నది కూడా ఎండిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తిన లోపాలు : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తలెత్తిన లోపాలతో వాటిని ఖాళీ చేశారు. మేడిగడ్డ వద్ద రోజూ ఐదు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నా పిల్లర్లు కుంగడంతో దిగువకు వదిలేస్తున్నారు. అన్నారంలోనూ నిల్వ ఉన్న రెండున్నర టీఎంసీలను బుంగల కారణంగా వదిలేశారు. ఎగువకు ఎత్తిపోతలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ప్రభావం ఎల్లంపల్లి, మధ్య, దిగువ మానేరుల్లో నీటి మట్టాలపై చూపిస్తోంది. ఈ ఏడాది వానాకాలంలో వచ్చిన ప్రవాహాలే తప్ప అనంతరం ఇన్‌ఫ్లోలు లేవు.
2023 మార్చిలో ఎల్లంపల్లిలో 14.34 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ప్రస్తుతం 8.72 టీఎంసీల నిల్వ ఉంది. మధ్యమానేరులో 20.26 టీఎంసీల నుంచి 9.43 టీఎంసీలకు, దిగువ మానేరులో 12.19 టీఎంసీల నుంచి 5.20 టీఎంసీలకు నిల్వలు పడిపోయాయి. గడిచిన 50 రోజుల్లో ఈ జలాశయాల కింద సాగు, తాగునీటి అవసరాలకు పెద్దఎత్తున నీటి వినియోగం నమోదైంది. శ్రీరామసాగర్ కింద 31.22 టీఎంసీలు, మధ్య మానేరు కింద 6.5 టీఎంసీలు, దిగువ మానేరు కింద 10.72 టీఎంసీలు వినియోగించారు. కడెం ప్రాజెక్టు గేట్ల సమస్యలతో నీటి నిల్వ లేకుండా పోయింది.
జలాశయాల నీటిమట్టం : పూర్తిస్థాయి నీటిమట్టం శ్రీశైలం జలాశయంలో వెనుక జలాలు వేగంగా తగ్గిపోతుండటంతో నదిలో మేటలు తేలుతున్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 810.80 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 5.32 టీఎంసీలే ఉన్నాయి. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులకుగాను 513.60 అడుగులకు చేరుకుంది. గోదావరి పరీవాహకంలోని చెరువుల్లో నీటిమట్టాలు పూర్తిగా పడిపోయాయి. సింగూరు జలాశయంలో కొంతమేరకు నీరు నిల్వ ఉండటం ఊరటనిచ్చే విషయం. శ్రీరామసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ దఫా మూడు సార్లు క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి 13 టీఎంసీల వినియోగం అధికంగా నమోదైంది.
ముఖ్యనగరాల్లో నీటి కొరత - చర్యలు చేపట్టకపోతే అంతే సంగతి - Water Crisis in India
ఆ కాలనీలో 25 ఏళ్ల నుంచి నో వాటర్ ప్రాబ్లమ్ - ఎందుకో తెలుసా? - Precautions to Avoid Water Crisis