Graduate MLC By Poll Results 2024 : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను, నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో ఏర్పాటు చేసిన గోదాంలో లెక్కిస్తున్నారు. 96 టేబుళ్లపై కౌంటింగ్ సాగుతోంది. ఇందులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. కాసేపట్లో బండిల్స్ కట్టడం పూర్తి అవుతుందని ఆర్వో హరిచందన తెలిపారు. మొదటి ప్రాధాన్యతలో 50 శాతంపైన వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తామని చెప్పారు. 50 శాతంపైగా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Telangana Graduate MLC Election : ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. గత సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్‌ను మే 27న నిర్వహించారు.
ఇందులో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట జిల్లాలోని 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో 4,63,839 ఓట్లకు గాను 3,36,013 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 72.44 శాతం పోలింగ్ నమోదైంది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 76.35 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి పోలింగ్ శాతం తగ్గింది.
మరోవైపు ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే లక్ష్యంగా పావులు కదిపింది. మరోవైపు నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా కృషి చేసింది. తెలంగాణలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి ఇక్కడ భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. మరి ఇప్పుడు ఎవ్వరు గెలుస్తానరేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.