Wanaparthy SP Giridhar Excels In painting : వృత్తిలో భాగంగా ఓ జిల్లాకు పోలీస్ బాస్‌గా పని చేస్తూ చిత్రలేఖనం, సాహిత్యాన్ని ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు రావుల గిరిధర్. తల్లి చీరలపైన వేసే డిజైన్లు, ఇంటి ఎదుట అలంకరించే ముగ్గులను చూసి మక్కువ కలిగి చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకున్నారాయన. సాహిత్యంపై మక్కువ కనబరుస్తూ కవితలు కూడా రాశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే చిత్రాలు గీస్తూ, కవితలు రాస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు వనపర్తి ఎస్పీ గిరిధర్.
స్వచ్ఛంద సేవలో ముందుంటారు : కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు రావుల క్షేమ, నిరంజనాచారిల కుమారుడే రావుల గిరిధర్. ఆయన పోస్టుగ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు. పలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. సామాజిక సేవలు చేయడాన్ని ఇష్టంగా భావించే వారు. 2007లో జరిగిన సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలో జైలు సూపరింటెండెంట్‌గా ఉద్యోగం సాధించి వరంగల్‌లో విధులు నిర్వహించారు.
2010లో రాసిన సివిల్స్‌లో ఆయన జాబ్ సాధించి డీఎస్పీగా గురజాల, బైంసా, సుల్తాన్‌బజార్, గజ్వేల్ ప్రాంతాల్లో పనిచేశారు. అనంతరం ప్రమోషన్ పొంది మహబూబాబాద్‌లో ఏఎస్పీగా విధులు నిర్వహించారు. అనంతరం పోలీసు శాఖలో అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. 2017లో ఎస్పీగా ప్రమోషన్ పొంది డీసీపీగా పనిచేశారు. ఇటీవల వనపర్తి జిల్లా పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టారు.
ప్రవృత్తి చిత్రలేఖనంలో గురువు తల్లి : తన తల్లి క్షేమను ఆదర్శంగా తీసుకుని చిత్రలేఖనంలో ఆసక్తిని పెంచుకున్నారు ఎస్పీ రావుల గిరిధర్. ఆమెకు డిజైనింగ్‌లో ప్రవేశముంది. ఇంటి వద్ద తల్లి వేసే వివిధ రకాల డిజైనింగ్ బొమ్మలను చూసి అనుకరించేవారు. ఇంటి ఎదుట వేసే వాటిని చిత్రరూపంలో ప్రదర్శించడానికి ఆసక్తి కనబరిచేవారు. ఇలా సమయం చిక్కినప్పుడల్లా ఆయనకు ఆసక్తిని కలిగించే బొమ్మలను డ్రాయింగ్ చేసేవారు. ఆ విధంగా ఇప్పటి వరకు 60 వరకు బొమ్మలను గీశారు.
తాను గీసిన బొమ్మలలో జంతుప్రపంచం, పక్షులు, చెట్లు, సెలయేరు వంటి ప్రకృతి రమణీయతలను తన చిత్రాల్లో పొందుపరుస్తున్నారు గిరిధర్. మరోవైపు తనకు ఇష్టమైన సాహిత్యంలోనూ మక్కువ ప్రదర్శిస్తున్నారు. కవితలు రాయడమంటే ఆయనకు పంచ ప్రాణం. శోధన పేరిట ఆయన రాసిన కవిత సంపుటి 2020 సంవత్సరంలో ప్రచురితమైంది. పలు కవితలతో కూడిన మరో సంపుటి 'అహంబ్రహ్మస్మీ' అనే కవిత సంపుటి ప్రచురణలో ఉంది.
"సమాజ హితమే ప్రధాన లక్ష్యంగా ఉద్యోగులు పనిచేస్తే ప్రజా సమస్యలకు తావుండదు. సేవ చేయాలన్న లక్ష్యం చిన్ననాటి నుంచే నాకు అలవడింది. పోలీసు శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉంటూ నా పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన శ్రద్ధ వహిస్తున్నాను. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నాను. వృత్తిలో ఆదర్శంగా ఉండటంతో పాటు ప్రవృత్తి(చిత్రలేఖనం)లో సమయం దొరికినప్పుడల్లా శ్రద్ధ చూపుతున్నా"- రావుల గిరిధర్, ఎస్పీ