Voters Protest At YSRCP Leaders Houses in AP : ఓటుకి నోటు ఇప్పుడిది ట్రెండింగ్ అంశం. ఏ పార్టీకి ఓటేసినా సరే అన్ని పార్టీల నాయకుల నుంచి మన మామూలు మనకు రావాల్సిందే అంటూ దోపిడీ నాయకులకు బుద్ది చెప్తున్నారు ప్రజలు. కానీ, ఇక్కడ అధికారంలో ఉండి కోట్లు దండుకుని ఇప్పుడు కొందరికే డబ్బు పంచడమేంటి మా లెక్కలు చూడండంటూ వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల ముందు క్యూ కట్టారు జనం.
ఓటుకు నోటు ఇస్తామని చెప్పి ఓటర్లను మోసం చేసిన వైఎస్సార్సీపీ నేతలకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవటంతో కొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లు, ఆఫీసుల ముందు బైఠాయించి ఓటర్లు నిరసన తెలిపారు. డబ్బులు ఇచ్చేవరకు కదిలేదే లేదని భీష్మించుకు కూర్చున్నారు. వైఎస్సార్సీపీ నేతల తీరును చూసి సామాన్యులు నవ్వుకుంటున్నారు.
Voters Protest At YSRCP MLA's Home : గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటర్లుకు డబ్బుల పంపిణీ సక్రమంగా చేయడం లేదంటూ వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల ముందు ప్రజలు నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఇంటి వద్దకు వెళ్లారు. అందరికీ డబ్బులు ఇచ్చి మాకెందుకు ఇవ్వటం లేదని సుమారు వంద మంది మహిళలు ఆందోళన చేశారు. ద్వితీయ శ్రేణి నాయకులంతా తమకు పంచాల్సిన డబ్బులను దాచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు డబ్బులు ఎందుకు పంచలేదంటూ కొన్ని వార్డులకు చెందిన మహిళలు వైఎస్సార్సీపీ నాయకులను నిలదీశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన వారికే డబ్బులు పంపిణీ చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Protest Against Minister Ushasri Charan : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉష శ్రీచరణ్ కార్యాలయం ముందు దుర్గాపేటకు చెందిన ముస్లిం ఓటర్లు ఆందోళనకు దిగారు. ఓటుకు డబ్బులు ఇస్తామంటూ కూపన్లు పంపిణీ చేసి ఇవ్వకుండా తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉష శ్రీచరణ్ ఫొటోతో ఉన్న కూపన్లను పట్టుకుని వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. రాత్రి సమయంలో కుర్చీలు వేసుకుని మరీ ఉష శ్రీచరణ్ కోసం ఎదురు చూశారు. ఇంటికి తాళం వేసి ఉండటం, తమను ఎవరూ పట్టించుకోకపోవటంతో వారంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమకు కావాల్సినవారికే డబ్బులు పంపిణీ చేసి మిగిలిన వారిని ఇలా మోసం చేస్తున్నారని స్థానిక ముస్లింలు ఉష శ్రీచరణ్‌పై మండిపడ్డారు.