Vizianagaram Harika & Bhargavi Enormously Talented Sisters Bags Medals in Weight Lifting : ఆటల్లో అమ్మాయిల ప్రాతినిథ్యం క్రమంగా పెరుగుతోంది. ఒకరిని చూసి ఇంకొకరు క్రీడల వైపు అడుగులేస్తున్నారు. అలా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ వెయిట్ లిఫ్టింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకున్నారు. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్నా వెనకడుగు వేయలేదు. కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో వెయిట్ లిఫ్టింగ్‌లోని నైపుణ్యాలు ఔపోసన పట్టారు. ప్రతీ టోర్నీలో పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారా అక్కాచెల్లెళ్లు.
ప్రతీ కుటుంబంలో అక్కాచెల్లెళ్లు కలిసి మెలగడం సర్వసాధారణం. కానీ, మేం అంతకు మించి అంటున్నారీ సిస్టర్స్. కలిసి ఉండటమే కాదు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోని నైపుణ్యాలు కలిసే నేర్చుకున్నారు. అనతికాలంలో రాష్ట్ర, జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఇటీవల జూనియర్, సీనియర్ కామన్వెల్త్ వెయిట్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పతకాలు సాధించారు.
సాధించిన పతకాలు చూపిస్తున్న ఈ సోదరీమణుల పేర్లు హారిక, భార్గవి. విజయనగరం జిల్లా కొండవెలగాడకు చెందిన శ్రీనివాస్, గౌరీల సంతానం. వీరిది వ్యవసాయ కుటుంబం. పెద్దమ్మాయి హారిక డిగ్రీ, చిన్నమ్మాయి భార్గవి ఇంటర్ చదువుతున్నారు. విద్య కొనసాగిస్తూనే వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో తమదైన ప్రతిభ కనబరుస్తున్నారు.
బాల్యంలోనే ఆటలపై మక్కువ పెంచుకున్న హారిక ఆరో తరగతిలోనే వెయిట్ లిఫ్టింగ్‌లోకి ప్రవేశించింది. అందులోని నైపుణ్యాలు వడివడిగా నేర్చుకుంది. ఇంటర్‌లో చదువుతున్నప్పుడు హారిక ప్రతిభా నైపుణ్యాలు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ గుర్తించారు. మరిన్ని మెళకువలు నేర్చించి తీర్చిదిద్దారు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు హారిక.
ప్రతీ టోర్నలో పతకాలు సాధిస్తోంది. 2019 నుంచి 2022 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 2023లో కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణం, ఏషియన్ గేమ్స్‌లో రజత పతకాలతో మెరిసింది. ఇటీవల ఫిజీ దేశంలో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 2 విభాగాలు కలిపి 186 కిలోల బరువులు ఎత్తి 2 రజత పతకాలు కైవసం చేసుకుందీ వెయిట్ లిఫ్టర్.
'అక్కను చూసి వెయిట్ లిఫ్టింగ్‌పై మక్కువ పెరిగింది. కుటుంబీకుల ప్రోత్సహంతో అక్క బాటలోనే ప్రయాణం మొదలు పెట్టాను. రాష్ట్రస్థాయి పోటీల్లో వరుస పతకాలు సాధించాను. 2022 జాతీయస్థాయి జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్యం, 2023, 2024లో రజతాలు దక్కాయి. ఇటీవల జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో 49కిలోల విభాగంలో బరిలోకి దిగాను. స్నాచ్ 69 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 86కిలోల బరువులెత్తి రజత కైవసం చేసుకున్నాను.' -భార్గవి, వెయిట్ లిఫ్టర్
పేదింటిలో పుట్టినా ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా ఏనాడూ వెనకడుగు వేయలేదు వీరిద్దరూ. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లెందుకు భారీగా ఖర్చవుతోందని ప్రభుత్వం సహాకారిస్తే మరిన్ని పతకాలు సాధిస్తామని చెబుతున్నారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వసతులు లేకున్నా సాధించాలనే తపన వీరిద్దరిలో ఉందని కోచ్ అంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అంటున్నారు. చత్తీస్‌గఢ్‌లోని పటియాలలో శిక్షణ పొందుతున్నారీ సొదరీమణులు. భవిష్యత్తులో అంతర్జాతీయ పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.