Young Woman Excels in Powerlifting: నిత్యం ప్రాక్టీసు చేసినా క్రీడల్లో బంగారు పతకాలు సాధించడం అంత ఈజీ కాదు. అలాంటిది ఎంబీబీఎస్ చదువుతూనే పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటింది ఆ యువతి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం సాధన చేసింది. ఫలితంగా పవర్ లిఫ్టింగ్‌లో వరల్డ్ ఛాంపియన్‌గా రికార్డు కైవసం చేసుకుంది షేక్ ఆసియా.
తండ్రి, చెల్లి పవర్ లిఫ్టింగ్‌లో నిష్ణాతులు. చిన్నప్పటి నుంచి తండ్రిని పవర్ లిఫ్టింగ్ కోచ్‌గా చూస్తూ పెరిగిన ఈ యువతి తాను కూడా ఈ రంగంలో మంచి పేరు సంపాదించాలి అని నిర్ణయించుకుంది. తనకు ఎంతో ఇష్టమైన డాక్టర్ చదువు చదువుతూనే తండ్రి వద్ద శిక్షణ తీసుకుంది. అనతికాలంలోనే పవర్‌లిఫ్టింగ్‌లో దేశానికే వన్నే తెచ్చేలా ప్రతిభను చాటింది.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన డాక్టర్ షేక్ ఆసియాకు డాక్టర్ అవ్వాలని కోరిక. అదే లక్ష్యంతో నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌లో ఏ కేటగిరిలో సీటు సాధించింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని నిమ్రా వైద్య కళాశాలలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. తనను పవర్ లిఫ్టింగ్‌లో ఛాంపియన్‌గా చూడాలన్న తన తండ్రి కల నేరవేర్చడం కోసం కఠోర సాధన చేసింది. ఫలితంగా ఇటీవల హాంకాంగ్‌లో మే 5 నుంచి 11వ తేదీ వరకు జరిగిన ఏషియన్ యూనివర్శిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించింది.
చెల్లెలి స్ఫూర్తితో తండ్రి కలను నిజం చేసేందుకు పవర్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేసింది ఆసియా. జిల్లా స్థాయి నుంచి ఏషియన్ యూనివర్శిటీ స్థాయి వరకు పోటీల్లో పాల్గొని విజయకేతనం ఎగురవేసింది. పవర్ లిఫ్టింగ్‌లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఘనత సాధించిన యువ వైద్యురాలు పీజీ మెడికల్ పూర్తి చేయటమే తన లక్ష్యమంటోంది.
తండ్రి సంథాని గతంలో ఇండియా తరపున పవర్ లిఫ్టింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. చెల్లెలు షేక్ సాదియా అల్మాస్ కూడా పవర్ లిఫ్టింగ్‌లో ఇండియా తరపున పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించింది. వీరిద్దరి పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్న ఆసియా హంకాంగ్‌లో జరిగిన పోటీల్లో 69 కేజీల విభాగంలో స్క్వాడ్, డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్లేస్ విభాగాల్లో బంగారు పతకాలు కైవసం చేసుకుంది. వీటితోపాటుగా ఓవరాల్ ఛాంపియన్ షిప్ బంగారు పతకాన్ని సైతం తన ఖాతాలో వేసుకుంది.
అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
తనకు శిక్షణనిచ్చేందుకు ప్రతిరోజూ మంగళగిరి నుంచి ఇబ్రహీంపట్నం వరకు తన తండ్రి మండుటెండలను సైతం లెక్క చేయకుండా వచ్చేవాడని చెబుతోంది ఈ యువ క్రీడాకారిణి. ఆసియా తండ్రి గత 20 ఏళ్లుగా మంగళగిరిలో సంథాని పవర్ లిఫ్టింగ్ అకాడమీలో యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూనే తన కూతురు సాధన చేసిందని, తన పట్టుదలే ఈ విజయానికి కారణమని చెప్తున్నాడు.
ఆసియా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా అండగా ఉంటామని పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వాలు క్రీడాకారులకు సహకారం అందిస్తే మరేందరో ఇలాంటి ఆణిముత్యాలు వెలుగులోకి వస్తారని చెప్తున్నారు. పవర్ లిఫ్టింగ్‌లో వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించటమే తన లక్ష్యమని ఈ యువ డాక్టర్ చెబుతోంది. అంతేకాదు వైద్య విద్యలో పీజీ పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న ఈ యువ క్రీడాకారిణికి మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.
"ఇబ్రహీంపట్నంలోని వైద్య కళాశాలలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న నాకు శిక్షణనిచ్చేందుకు ప్రతిరోజూ మంగళగిరి నుంచి నా తండ్రి వచ్చేవారు. నాకోసం మండుటెండలను సైతం లెక్క చేయకుండా వచ్చి శిక్షణనిచ్చారు. నేను పవర్ లిఫ్టింగ్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని నా తండ్రి కలలు కన్నారు. పవర్ లిఫ్టింగ్‌లో వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించి వారి కష్టానికి తగిన ఫలితం అందించాలనుకుంటున్నాను. దీంతోపాటు వైద్య విద్యలో పీజీ పూర్తి చేస్తాను." - షేక్ ఆసియా, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి