Vijayawada Ravindra Rao Adventures : ఏడు పదుల వయసు రాగానే చాలా మంది కాళ్ల నొప్పులు, నడుము నొప్పులతో ఇంటికే పరిమితం అవుతుంటారు . కానీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన రవీంద్ర రావు వివిధ సాహస యాత్రలు చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ట్రెక్కింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‌తో పాటు రన్నింగ్ చేస్తూ యువతకేం తక్కువ కాదు అన్నట్లుగా నిలుస్తున్నారు. సరదాగా సైకిల్‌పై రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. వేల మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాలను సైతం అలవోకగా ఎక్కి అబ్బుర పరుస్తున్నారు రవీంద్రరావు.
ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమే లక్ష్యం : ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం (Mount Everest)లోని బేస్ క్యాంప్ వరకూ వెళ్లి వచ్చారు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని (Mount Kilimanjaro) సైతం అధిరోహించారు. ఐఐటీ ఖరగ్‌పుర్, ఐఐఎస్‌ఈ (బెంగళూరు)లో ఉన్నత చదువులు చదివిన రవీంద్ర రావు, ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నారు. 2027లోగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమే తన లక్ష్యమని అంటున్నారు. ఆ వివరాలు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
ఆకాశంలో సైకిల్ తొక్కొచ్చు - పక్షిలా ఎగరొచ్చు - విశాఖలో ఇవి అస్సలు మిస్ కావద్దు
రన్నింగ్ పోటీల్లోనూ పాల్గొంటా : 'చదువుకునే రోజుల్లో సైకిల్‌పై కళాశాలకు వెళ్లేవాడిని. తరువాత 63 ఏళ్ల వయసు నుంచి మళ్లీ సైక్లింగ్ మొదలుపెట్టాను. ప్రతి రోజు చిలకలూరిపేట, ఒంగోలు వరకు వెళ్తుంటా. కనీసం గుంటూరు వరకు అయినా వెళ్తాను. 300, 400 కిలోమీటర్ల చొప్పున ఎన్నో సార్లు ప్రయాణం చేశాను. సైకిల్‌పై హైదరాబాద్‌కు కూడా వెళ్లి వచ్చాను. ఆడాక్స్ ఇండియా (Audax India) అనే సంస్థ వరసగా నిర్వహించే 200, 300, 400, 600 కిలోమీటర్ల పోటీలను పూర్తి చేశాను. గ్రామీణ ప్రాంతాలు, ప్రకృతిని చూసుకుంటూ వెళ్లడానికి ఇష్టపడతాను. ఉత్తరాంధ్రలో 900 కిలోమీటర్లు ఐదు రోజుల్లో చుట్టొచ్చాను. వచ్చే ఏడాది మార్చిలో లేపాక్షి, గండికోట, ఓర్వకల్లు, కదిరి, శ్రీశైలం ఇలా దక్షిణాంధ్ర మొత్తం 2,400 కిలోమీటర్లకు పైగా తిరిగేలా ప్రణాళిక రచించుకున్నాను. వాటితో పాటు రన్నింగ్ పోటీల్లోనూ పాల్గొంటాను. హైదరాబాద్, విజయవాడతో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన మారథాన్, హాఫ్ మారథాన్ పూర్తి చేశాను' అని రవీంద్ర రావు తెలిపారు.
నా కూతురితో కిలిమంజారో పర్వతాన్నీ ఎక్కా : 'ఎవరెస్ట్ శిఖరంలో 5,365 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌ను 42 ఏళ్ల నా కూతురితో కలిసి అధిరోహించాను. ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్నీ ఇద్దరం ఎక్కాం. దాని ఎత్తు 5,895 మీటర్లు. 2027 మే లోపు ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్తిగా అధిరోహించాన్నదే నా కోరిక. ప్రస్తుతం దాని కోసం సిద్ధం అవుతున్నాను.'
"సైకిల్ మే సవాల్" - వేల కిలోమీటర్లు దూసుకెళ్తున్న సాహసికులు
ఆరోగ్యం లేకుంటే దేన్నీ ఆస్వాదించలేం : 'ఐరన్ మ్యాన్ ఈవెంట్‌లో 3 విభాగాలు ఉంటాయి. దీనిలో 3.8 కిలోమీటర్లు ఈదాలి. తరువాత 180 కిలోమీటర్లు సైక్లింగ్, 42 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి. ఇవి అన్నీ ఒకదాని తరువాత ఒకటి నిరంతరాయంగా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. వాటి కోసం సిద్ధం అవుతున్నాను. జీవితాంతం మన శరీరం తప్ప ఇంకేది మనకు తోడు ఉండదు. అందుకే ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం జీవితంలో ఏ స్థాయికి వెళ్లినా ఆరోగ్యంగా లేనప్పుడు దానిని ఆస్వాదించలేం. ప్రస్తుత తరానికి సెల్ ఫోన్ తప్ప మరో ధ్యాస ఉండటం లేదు. వారికి నేను సూచించేది ఒక్కటే. వ్యాయామం చేస్తే చదువు, ఉద్యోగ ఒత్తిడిని కూడా చాలా సులువుగా తట్టుకోవచ్చు' అని రవీంద్ర రావు తెలిపారు.
సైక్లింగ్‌లో సత్తా చాటుతున్న యువకుడు- 9వ సారి జాతీయ పోటీలకు ఎంపిక