Vijayawada People Facing Water Problems: నీరు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం ఆనందం. అలాంటిది ఆ నీరు కూడా కలుషితమైతే వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు బెజవాడ వాసులు. కృష్ణా నది చెంతనే ఉన్నా స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవట్లేదు. ఓవైపు అడపాదడపా వర్షాలు మరోవైపు కలుషిత నీటితో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం, అధికారులు విస్మరించారు. తాగునీటి సరఫరాలో ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ ఎర్ర రంగులో చెత్తాచెదారంతో కలుషితంగా వస్తున్న నీటినే ప్రజలకు వీటినే సరఫరా చేస్తోంది. స్వచ్ఛమైన తాగనీరు అందించండి మహాప్రభో అని అనేక సార్లు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కలుషిత నీటితో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని గతంలో అనేక పరీక్షల్లో తేలింది. అయినా పాలకుల్లో చలనం లేదు. మరోవైపు వాటర్ పైపులైన్లు లీకవుతున్నా మరమ్మతులు చేయడం లేదు. ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రామలింగేశ్వర నగర్‌లో నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకు ఏళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. జేడీ నగర్‌లోని వాటర్ ట్యాంకుల నుంచి బోరు నీళ్లు సరఫరా చేస్తుండటంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీటి పన్ను వసూలు చేస్తున్న అధికారులు స్వచ్ఛమైన నీటిని అందించడం లేదని మండిపడుతున్నారు. గంగిరెద్దుల దిబ్బలోని నీటి ట్యాంకు నిర్వహణ సక్రమంగా లేదు. నగర శివారు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోనూ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరపాలక సంస్థ విడుదల చేస్తున్న నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో పెద్ద మొత్తం చెల్లించి ప్రజలు బయట వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుక్కుంటున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. నిర్వాహకులు సరైన ప్రమాణాలు పాటించకపోయినా వారిపైనా నిఘా లేదు. ఇలా అన్ని రకాలుగా ప్రజలు నీటి కోసం తిప్పలు పడుతున్నారు.