Vijayawada Recover From Budameru Flood : వరదలు తగ్గడంతో విజయవాడలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. బుడమేరు వరదతో విలవిల్లాడిన సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు కోలుకుంటున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోవడంతో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. బాధితులకు నిత్యావసరాల పంపిణీ వేగవంతమైంది. రేషన్‌తో పాటు పాలు, పండ్లు ఉచితంగా అందజేస్తున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం రాయితీపై కూరగాయలు అందజేస్తోంది.
Vijayawada Floods : వరద ప్రభావిత కాలనీల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వైరల్ జ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో రహదారులు మళ్లీ రద్దీగా మారాయి. బురద చేరిన ఇళ్లను, తడిసిన - పాడైన వస్తువులను ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లలోని వస్తువులు, సామగ్రిని బాగు చేసేందుకు బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తోంది.
పెరుగుతున్న వాహనాల రాకపోకలు : విజయవాడ జక్కంపూడి కాలనీలో వరద క్రమంగా తగ్గుతోంది. బుడమేరు పొంగిన తర్వాత వారానికి పైగా తీవ్ర అవస్థలు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నారు. సురక్షిత ప్రాంతాలు, బంధువుల ఇళ్లకు వెళ్లినవారు తిరిగి సొంతగూళ్లకు చేరుకుంటున్నారు. రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్నారు. వాహనాల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి.
మంత్రుల పర్యటన : 9 రోజులుగా వరదలో చిక్కుకున్నప్పుడు ప్రభుత్వం ఆదుకుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయులు, ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు జక్కంపూడి కాలనీలో పర్యటించి ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు, రేషన్ పంపిణీ చేశారు. దాతలు బాధిత కాలనీల్లో తిరుగుతూ దుస్తులు, భోజనం ప్యాకెట్లు అందజేశారు.
పాయకాపురం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటిని మోటార్లతో వీఎంసీ తోడి పోస్తోంది. పాయకాపురంలోని పలు కాలనీల ప్రజలు వరద నీటితో 9 రోజులుగా తీవ్ర అవస్థలు పడ్డారు. కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిందని వరద బాధితులు చెప్పారు.
ఉచితంగా రిపేర్లు : వరదల కారణంగా పాడైన ఇళ్లలోని సామగ్రిని బాగు చేసేందుకు కొందరు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సింగ్‌నగర్‌లో పాడైన గ్యాస్ స్టవ్‌లను అదే ప్రాంతానికి చెందిన ఏజెన్సీ వాళ్లు ఉచితంగా బాగు చేసి ఇస్తున్నారు. వాహనాల మరమ్మతుల కోసమూ ప్రజలు క్యూ కట్టారు.