National Highways to Vijayawada City : విజయవాడ నగరానికి నేషనల్ హైవేల నిర్మాణం మణిహారంగా మారనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు పలు నూతన రహదారుల నిర్మాణం జరగనుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.3,811.45 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దశాబ్దంగా అపరిష్కృతంగా ఉన్న ఆర్వోబీలకు ఈ సంవత్సరం మోక్షం లభించింది. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎంపీలు కేశినేని శివనాథ్(చిన్ని), వల్లభనేని బాలశౌరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించి ఈమేరకు పలు రహదారులకు మంజూరు సాధించారు.
Vijayawada City Development : రహదారుల కనెక్టివిటీ పెరగడంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే విజయవాడకు పశ్చిమ బైపాస్ నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి 16 విస్తరణలో భాగంగా చిన్నఅవుటపల్లి నుంచి కాజా వరకు వయా నున్న, గొల్లపూడి మీదుగా ఆరు వరసల దారి నిర్మాణాన్ని చేపట్టారు. ఇది పూర్తయితే అమరావతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి కేవలం 12 నిమిషాల్లో చేరుకోవచ్చు. మూడో ప్యాకేజీ దాదాపుగా, కృష్ణా నదిపై వంతెన 70 శాతం పూర్తయింది. వెంకటపాలెం-కాజా మధ్య పనులు జరుగుతున్నాయి. ఈ దారి రెండు ప్యాకేజీల అంచనా వ్యయం రూ.2,200 కోట్లు.
రేడియల్ రహదారులు : పశ్చిమ బైపాస్ దాదాపు 45 కిలోమీటర్లు ఉంది. విజయవాడ నగరాన్ని పశ్చిమ బైపాస్‌ను కలుపుతూ రేడియల్ రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలను రహదారులు భవనాల శాఖకు ఎంపీ చిన్ని అందించారు. గొల్లపూడి నుంచి జాతీయ రహదారి 65 ఉంది. తర్వాత రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లిలను కలిపేలా రేడియల్ దారులు వేయనున్నారు. ఇప్పటికే ఈప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. రేడియల్ దారులు ఏరాటైతే మరింత వేగంగా అభివృద్ధి జరగనుంది. పశ్చిమ బైపాస్‌కు అనుబంధంగా సర్వీసు రోడ్లు కావాలని ఆ గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో కలిపి 10 వరకు అండర్‌పాస్‌లు ఇచ్చారు.
ఖమ్మానికి తగ్గిన దూరం ! : మరో గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి విజయవాడ నుంచి ఖమ్మం నిర్మాణంలో ఉంది. మొత్తం 90 కిలోమీటర్ల మేర ఆరు వరసలుగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండు ప్యాకేజీలు మేఘా సంస్థ దక్కించుకుంది. సుమారు రూ.2,500 కోట్లతో నిర్మాణం చేపట్టారు. రాయనపాడు నుంచి ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మీదుగా మధిర ఆపై ఖమ్మం వెళ్తుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి ఖమ్మం వెళ్లేందుకు 120 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందుకోసం వయా వత్సవాయి, బోనకల్లు మీదుగా లేదంటే కోదాడ మీదుగా వెళ్లాలి. ప్రస్తుత గ్రీన్‌ఫీల్డ్ పూర్తయితే 30 కిలోమీటర్ల దూరం కలిసి రానుంది. దీన్ని విజయవాడ పశ్చిమ బైపాస్‌కు అనుసంధానిస్తారు.
తూర్పు బైపాస్ ! : విజయవాడ నగరానికి తూర్పు బైపాస్‌కు ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,716 కోట్లు కేటాయించారు. కృష్ణా జిల్లా రామారావుపేట నుంచి రొయ్యూరు మీదుగా గుంటూరు జిల్లా కాజా వరకు నిర్మించేలా త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఇది పూర్తి చేస్తే విజయవాడకు వలయ రహదారి ఏర్పడినట్లే. అదేవిధంగా తూర్పు బైపాస్ నిర్మాణానికి బదులు ఎన్‌హెచ్‌ఏఐకు లాజిస్టిక్ హబ్ కోసం ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించనుంది.
నగరంలో పైవంతెన : జాతీయ రహదారి 16 మీద సుదీర్ఘ పైవంతెనకు నిధులు మంజూరయ్యాయి. ఈ సంవత్సరం బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.669 కోట్లు కేటాయించింది. ఇటీవలే డీపీఆర్ పూర్తి చేశారు. త్వరలో టెండర్లు పిలవనున్నారు. మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు వరకు దాదాపు 6.500 కిలోమీటర్లు నిర్మిస్తారు. ఇది పూర్తయితే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వెలుగు రేఖ, రాజధాని అమరావతి మీ ఊరుకు ఎంత దూరమంటే? - AMARAVATI OUTER RING ROAD
అమరావతి మహానగరికి ఓఆర్ఆర్ హారం- రాష్ట్రంలో ఇక భూములు బంగారం - Amravati Ring Road Project