YSRCP Leaders Looted Lands in AP : ‘జగనన్న కాలనీలు’ పేరిట ఇళ్ల స్థలాల పంపిణీ కోసం భూముల సేకరణ ముసుగులో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సాగించిన దోపిడీ విలువ దాదాపు రూ.1,500 కోట్ల పైనే ఉండొచ్చని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance and Enforcement) విభాగం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. ఈ అక్రమాలకు బాధ్యులు, కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుల వివరాలపై ఆరా తీస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లేఅవుట్లకు సంబంధించి, ఏయే ప్రాంతాల్లో భూములు కొన్నారు? అక్కడ వాస్తవ మార్కెట్ విలువ ఎంత? ఎంత ధరకు కొనుగోలు చేశారు? ఆ సొమ్ము ఎవరి ఖాతాలకు జమ చేశారు? అక్కడి నుంచి అది ఎవరికి చేరిందనే అంశాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. లేఅవుట్ల వారీగా సంబంధిత వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే కొంత మంది వివరాలతో జాబితా సిద్ధం చేసింది. వారిపై క్రిమినల్ కేసుల నమోదు, సొమ్ము రికవరీకి సిఫార్సుకు యోచనలో ఉంది.
వెలుగులోకి వైఎస్సార్సీపీ భూ అక్రమాలు - రికార్డుల పరిశీలనలో బయటపడుతున్న వాస్తవాలు
అప్పట్లో ప్రజాప్రతినిధులుగా ఉన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర, నియోజకవర్గ నేతలు మొదలు గ్రామస్థాయి నాయకుల వరకూ అనేక మంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారి పరిధిలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 25 వేలకు పైగా ఎకరాల భూమి కొనుగోలుకు రూ.11,500 కోట్లకు పైగా వెచ్చించారు. అందులో అత్యధిక శాతం సొమ్ము వైఎస్సార్సీపీ నేతలు వివిధ మార్గాల్లో దోచుకున్నట్లు తేల్చింది.
ఒక్కో చోట ఒక్కో తరహాలో : భూ సేకరణను అడ్డం పెట్టుకుని గత పాలకులు ఒక్కోచోట ఒక్కో తరహాలో దోచుకున్నట్లు విజిలెన్స్ విచారణ తేల్చింది. కొన్ని చోట్ల వాస్తవ మార్కెట్ విలువ కంటే అనేక రెట్లు అధిక ధరలకు ప్రభుత్వంతో భూములు కొనిపించి ఆ వ్యత్యాసం మొత్తాల్ని కాజేసినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఉదాహరణకు ఎకరం రూ.10 లక్షల విలువ చేసే స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకులు రూ.30-40 లక్షలకు, రూ.30 లక్షల విలువ చేసే స్థలాన్ని రూ.50-60 లక్షలకు కొనుగోలు చేసి దోచుకున్నట్లు తేలింది.
ప్రభుత్వం భూములు సేకరించాలనుకుంటున్న ప్రాంతాలను అధికారులతో కలిసి వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేతలే ముందుగానే గుర్తించారు. వారు అంతకు ముందే ఆయా ప్రాంతాల్లోని భూమిని స్థానిక రైతుల నుంచి తక్కువ ధరకు కొనేశారు. తర్వాత 40% నుంచి 45% ధర పెంచేసి, ప్రభుత్వానికి విక్రయించారు. కొన్ని చోట్ల భూ యజమానులైన రైతులతో వైఎస్సార్సీపీ నేతలు ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. అక్కడి మార్కెట్ విలువ కంటే అధిక ధరకు ప్రభుత్వంతో ఆ భూమి కొనుగోలు చేసేలా చేశారు. ప్రభుత్వం నుంచి అధికంగా వచ్చిన మొత్తంలో 70% వైఎస్సార్సీపీ నేతకు, 30% భూ యజమానికి అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కొందరు వైఎస్సార్సీపీ నాయకులు తమ భూములకు దగ్గర్లో ఈ లే అవుట్ల కోసం ప్రభుత్వంతో అధిక ధరలకు భూములు కొనిపించారు. తద్వారా వారి భూముల విలువ పెరిగేలా చర్యలు తీసుకున్నారు.
నివాసయోగ్యం కాని భూముల్నీ అంటగట్టేశారు : రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏ మాత్రం నివాసయోగ్యం కాని భూముల్నీ ప్రభుత్వంతో అత్యధిక ధరలకు అప్పటి ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఇలాంటి లే అవుట్ల వివరాలన్నింటినీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రత్యేకంగా సేకరించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడిలో 586 ఎకరాల ముంపు (ఆవ) భూముల్ని ఎకరా రూ.45 లక్షల చొప్పున కొన్నారు. ఆ భూములు నివాసయోగ్యంకు అసలు పనికిరావు. వాటి విలువ ఎకరం రూ.20 లక్షలకు మించకపోయినా సరే వాటిని అధిక ధరలకు కొన్నారు. ఈ ఒక్క లే అవుట్‌లోనే రూ.150 కోట్లు పక్క దారి పట్టినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మరి కొన్ని చోట్ల కొండలు, గుట్టల్ని కొనేలా చేశారు. ఉమ్మడి గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఇలాంటి తరహ అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని విజిలెన్స్ గుర్తించింది.