Vedire Sriram on Krishna and Godavari Projects : నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాంలు ప్రమాదంలో పడ్డాయని కేంద్ర జల్ శక్తి మంత్రి సలహాదారు, నదుల అనుసంధానంపై టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ వెదిరె అన్నారు. ఇరు ప్రభుత్వాలు ఏపీ రీ ఆర్గనైజేషన్ ప్రకారం కేబీఆర్ఎం(KRMB) సహకారం తీసుకుని సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని కవాడీగూడ సీబీఓ టవర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల స్థితి, మేడిగడ్డ సమస్య, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికార పరిధి వంటి విషయాలపై స్పందించారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు, నిర్వహణ, తాజా పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మానవ తప్పిదం వల్ల సరైన నిర్వహణ లేకపోవడంతో రెండు ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నాయని, వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ వెదిరె(Sriram Vedire) ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు దిక్కు లేదని ఈ విషయాన్ని నేషనల్ సేఫ్టీ అథారిటీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విఫలమయ్యాయని ఇరు రాష్ట్రాల ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు సంబంధించిన కొత్త నిబంధనలను టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ వెదిరె వెల్లడించారు.
సాగర్‌ను పరిశీలిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం - నీటి నిల్వలు, స్పిల్ వేలపై ఆరా!
Sriram Vedire Press Meet in Hyderabad : ఇద్దరూ గొడవపడితే తాము ఎలా బాధ్యత వహిస్తామని శ్రీరామ్ వెదిరె సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జలాలు(Krishna Water) కేఆర్ఎంబీకి తాకట్టు పెట్టారని అనడం తప్పు, ప్రాజెక్టులు స్వాధీనం చేసుకుని ఏం చేస్తామని అన్నారు. ప్రజల్లో భ్రమలు కల్పించి ఎమోషనల్ సృష్టించడం సరికాదని హితవుపలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఎక్కువగా ఖర్చు అయ్యాయని, ఆ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వెచ్చిస్తే 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని తేల్చి చెప్పారు.
"రాష్ట్రం సమాచారం ఇస్తేనే ఎన్డీఎస్‌ఏ విచారణ చేయగలుతుంది. మేడిగడ్డ కట్టేటప్పుడు జియోలాజికల్ సర్వే వారి సహాయం తీసుకుని ఉండాల్సింది. సర్వే చేయకుండా ప్రాజెక్టు కట్టడం అతిపెద్ద తప్పు. థర్డ్ పార్టీ నాణ్యత తనిఖీలు చేయడం చాలా అవసరం. ప్రాజెక్టు నిర్మాణం వివిధ స్థాయిల్లో కంప్లిషన్ రిపోర్టులు ఇవ్వాలి. మొత్తం ప్రాజెక్టుకు ఒకేసారి కంప్లిషన్ రిపోర్టు ఇచ్చారు. ఎన్డీఎస్‌ఏ కమిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. వచ్చేవారం ఎన్డీఎస్‌ఏ కమిటీ రాష్ట్రానికి వస్తుంది. అడిగిన సమాచారం కమిటీకి ఇస్తే విచారణ సత్వరం పూర్తవుతుంది. తెలంగాణకు సహకరించాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా. రాష్ట్రం నుంచి స్పష్టమైన సమాచారం రావట్లేదు. సరైన సమాచారం ఇవ్వకపోతే కేంద్రం కూడా సాయం చేయలేదు." - వెదిరె శ్రీరామ్, కేంద్ర జల్ శక్తి మంత్రి సలహాదారు
నీటి ఎత్తిపోతల కోసం ఏటా అయ్యే రూ.10 వేల కోట్లు ఆదా అయ్యేవని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)కు సీడబ్ల్యూసీ అనుమతి లేదని, డిజైన్ ఫెయిల్, కావున పూర్తి బాధ్యత నీటిపారుదల శాఖదేనని స్పష్టం చేశారు. సాధారణంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం రూపాయి ఖర్చు చేస్తే రూపాయిన్నర రావాలి కానీ ఇక్కడ అలా లేదని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ఆయకట్టు కింద ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అయితే 100 నుంచి 120 బస్తాలు దిగుబడి వచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపారంటూ తీవ్రంగా తప్పుపట్టారు.
కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో అన్ అప్రూవుడ్ ప్రాజెక్టులకు నీరు వెళుతుందని శ్రీరామ్ వెదిరె తెలిపారు. ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుకు జల్‌శక్తి అనుమతి లేదని ఇది అన్ అప్రూవుడ్ ప్రాజెక్టు అని తేల్చారు. కృష్ణా నుంచి అనధికారికంగా నీరు వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టుకు అనుమతి కోరితే సీడబ్ల్యూసీ నిరాకరించిందని ఆయన పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీపై అధికారుల విశ్లేషణ - దశల వారీగా మిగతా బ్లాకులు, ఆనకట్టలపై ఇన్వెస్టిగేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు కష్టమేనంటున్న ఇంజినీరింగ్ అధికారులు