Obscene Dances in Hyderabad Pubs : గచ్చిబౌలి పబ్‌లో మత్తు పదార్థాలు తీసుకొని దొరికిన ప్రబుద్ధులు. మాదాపూర్ పబ్‌లో నవ్వుతూ పలకరించి జేబులు గుల్లచేసే అందమైన అమ్మాయిలు. బంజారాహిల్స్ బార్‌లో విదేశీ యువతుల నగ్న, అర్ధనగ్న నృత్యాలు. హైదరాబాద్‌లోని పలు పబ్‌లు, బార్‌లు వినోదం ముసుగులో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. యువతను ఆకట్టుకునేందుకు దేశ, విదేశాల నుంచి అందమైన మగువలను రప్పిస్తున్నాయి. తమను తాము మరచిపోయే సింథటిక్ డ్రగ్స్‌ను రుచిచూపుతున్నాయి. పలుమార్లు టీజీన్యాబ్, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తరచూ దాడులు చేసి కేసులు నమోదుచేస్తున్నా నిర్వాహకులు తీరుమార్చుకోవట్లేదు. డబ్బులు గుప్పించి మళ్లీ అనుమతులు తెచ్చుకుంటున్నారు.
వలపు వల - జేబుగుల్ల : గచ్చిబౌలి, బంజారాహిల్స్, మాదాపూర్ ఇలా ఖరీదైన ప్రాంతంలో పబ్‌కు ఒంటరిగా వెళ్లారా? కాస్త రిలాక్స్ అవ్వాలనే సమయంలో పక్కనే కూర్చున్న అందమైన యువతి పలకరిస్తుంది. చిరునవ్వుతో ఆరా తీస్తుంది. తన స్నేహితుడు వస్తానని చెప్పి ఎక్కడో చిక్కాడంటూ నమ్మిస్తుంది. మాటలతో మాయచేసి సరదా సంభాషణ నుంచి వలపు వాకిట్లోకి తీసుకెళ్తుంది. ఛీర్స్, డ్యాన్స్, అపై రొమాన్స్ అంటూ ఊరిస్తుంది. సదరు వ్యక్తి తేరుకునేలోపు మాయమవుతుంది.
వెంటనే పబ్ నిర్వాహకులు వేలల్లో బిల్లు చేతిలో పెట్టి అతని ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న దందాపై పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నా కొందరు యజమానులు తమ తీరు మార్చుకోవడం లేదు. గోవా, ముంబయి నగరంలోని పలు పబ్‌లు ఇతర రాష్ట్రాల అమ్మాయుల, మహిళలకు ఉచిత ప్రవేశం కల్పించి కమీషన్ ఆశచూపి ఒంటరిపక్షులను యథేచ్ఛగా దోచుకుంటున్నారు.
- లెస్పాబ్ పబ్‌లో ఇదే తరహాలో నిర్వాహకులే యువతులను తీసుకొచ్చి కస్టమర్లతో అధికంగా మద్యం తాగి బిల్లు పెరిగేలా దందా చేశారు.
- బంజారాహిల్స్‌లోనూ ఒక పబ్‌లో అమ్మాయిలను తీసుకొచ్చి దందా చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
- తాజాగా టాస్ పబ్ వ్యవహారంలోనూ ఇదే చోటుచేసుకొంది. దాదాపు 42 మందిలో 22మంది అమ్మాయిలు, 20 మంది వివాహితులు శనివారం రాత్రి నిర్వహించిన పోలీసుల దాడుల్లో దొరికారు. వీరిలో చాలామంది గృహిణులు ఉన్నారు.
- ఆర్థిక అవసరాలకు పబ్‌కు వెళ్లి కాసింత సమయం అక్కడున్న వారిని తమ డ్యాన్స్‌లతో రంజింపచేస్తున్నారు. వారితో కలిసి మద్యం సేవించి బిల్లును రెట్టింపు చేసి కమీషన్ తీసుకుంటున్నామంటూ పోలీసుల ఎదుట వాపోయారు.
సామాజిక మాధ్యమాలకు దూరంగా : దిల్లీ, ముంబయి, పుణె, గోవా, బెంగళూరు వంటి నగరాల్లో కొన్ని పబ్బులు, బార్లలో యువతులు ప్రత్యేకంగా నృత్యాలు చేయడానికి వస్తుంటారు. రూ.2000-రూ.3000 ఇచ్చే ఒప్పందంతో వారిని రప్పిస్తున్నారు. కొన్ని పబ్‌లు ముజ్రాపార్టీకి ముంబయినుంచి హిజ్రాలను రప్పిస్తున్నారు. విదేశీ యువతుల నృత్యాన్ని ఆస్వాదించేందుకు ప్రత్యేక రుసుం వసూలు చేస్తున్నారు.
నవ్వుకు చిక్కి కేసుల్లో ఇరుక్కోవద్దు : పబ్‌కి వెళ్లే సమయంలో అక్కడి పరిస్థితులను ముందుగా తెలుసుకొని వెళ్లాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. పరిచయం లేని అమ్మాయిలు, మహిళలు వచ్చి మాట, మందు కలిపితే ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. గతంలో రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో డ్రగ్స్ పేరుతో పోలీసులు దాడి చేసి దాదాపు 200 మందిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని ఆఫ్టర్ 9 పబ్‌లోనూ ఇదే తరహాలో 175 మందిని, టాస్ పబ్‌లో 142 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చీకటి కార్యకలాపాలకు పాల్పడే పబ్‌లు, బార్‌లను సీజ్ చేయమని నగర సీపీ సీవీ ఆనంద్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం.
ఇదోరకం వలపు వల- హాయ్ అంటూ మెసేజ్ చేస్తారు పబ్‌కు తీసుకెళ్లి? - Hyderabad Dating Scam
మత్తు పదార్థాలకు అడ్డాగా పబ్బులు- వరుస దాడులతో హడలెత్తిస్తున్న న్యాబ్ - TG NAB POLICE RAIDS IN PUBS