Underground Temple in Warangal : శిల్పకళ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కాకతీయుల కాలం. ఆ కళకు పెట్టింది పేరు వారు. తెలంగాణలోని చాలా ప్రదేశాల్లో వారి కళ ఉట్టిపడుతుంటుంది. వాళ్లు నిర్మించిన కోటలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్‌లో కాకతీయుల కట్టడాలు వారి వైభోగానికి నిదర్శనం. వారి శిల్పకళ గురించి పలు విదేశీయులు నాటి నుంచి నేటి వరకు పుస్తకాల్లో కూడా వర్ణించారు. రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి ఇలా ఎన్నో అద్భుత కట్టడాలు అక్కడ చూడవచ్చు. అయితే భూగర్భంలో నిర్మించిన ఆలయం గురించి మీకు తెలుసా? ఈ విషయం అక్కడి వారికి తప్పితే, మిగిలిన చాలా మందికి తెలియదు. ఆ భూగర్భ దేవాలయం గురించి ఇప్పుడు మనమూ తెలుసుకుందాం.
100కు పైగా ఆలయాలు : చారిత్రక ఓరుగల్లులోని ఖిలా వరంగల్ మట్టి కోట ఉత్తరం వైపున భూగర్భంలో ఉన్న కాకతీయుల కాలం నాటి త్రికూటాలయం ఇది. గండి పడిన ఏరియాలో ఉన్న ఈ గుడిని అప్పట్లోనే పురావస్తు శాఖ గుర్తించింది. నాటి ఓరుగల్లు కోట సముదాయాన్ని 7 ప్రత్యేక భవంతులతో శ్రీచక్రం ఆకారంలో నిర్మించారని, వీటి పరిధిలో దాదాపు 100కు పైగా ఆలయాలు ఉండేవని 'ఏకమ్రనాథుని ప్రతాపరుద్రీయం గ్రంథం' ఆధారంగా చరిత్రకారులు చెబుతున్నారు.
ఆలయాన్ని పరిరక్షించాలి : అప్పటి కాలంలో దండయాత్రల నుంచి ఆలయాలను రక్షించడానికి నాడు ఇలా భూగర్భంలో నిర్మించి ఉండొచ్చని యువ చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య తెలిపారు. నాడు కోటను పహారా కాసే సైనికులే ఇక్కడ నిత్యం పూజలు చేసేవారని, కాలక్రమంలో ఆలయం ధ్వంసమై వైభవాన్ని కోల్పోయిందన్నారు. భూగర్భంలో ఇంకా ఆలయాలు ఉండొచ్చని, ప్రస్తుతం 3 ఆలయాల ఆనవాళ్లు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆలయాన్ని పరిరక్షించాలని చరిత్రకారులు కోరుతున్నారు.
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో : వరంగల్ అనగానే వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం ఇవే గుర్తుకు వస్తాయి. ఇటీవల రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించింది. దీంతో ఆ ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. అలాగే ఎక్కడా లేని విధంగా వేయి స్తంభాల గుడి ఇక్కడ ఉంది. ఈ గుడికి కూడా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అలాగే కాకతీయుల కళాతోరణం నేటికీ ఉంది. ఇది తెలంగాణ రాజముద్రలో ఉంటుంది. వీటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దోమకొండ కోటకు యునెస్కో పురస్కారం
ప్రపంచం మెచ్చిన కమలాపూర్ హిమ్రూ చీరలు.. మగువలకు తెచ్చే అందాలు..