Underground Drainage Works in Vijayawada : వర్షం పడితే బెజవాడ వాసులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. విజయవాడలో డ్రైనేజీ పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ముంపు సమస్యను తీర్చేలా పనులు చేపట్టింది.
విజయవాడ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వం పనులు చేపట్టింది. 30శాతానికిపైగా పనులు పూర్తి చేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విజయవాడ డ్రైనేజీ పనుల్ని పట్టించుకోలేదు. బిల్లులు సైతం సకాలంలో చెల్లించక గుత్తేదారులు డ్రైనేజీ నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లు జలమయం కావడంతో పాటు ఇళ్లు, వ్యాపార సముదాయాల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. తక్షణమే తాత్కాలికి చర్యలకు పూనుకున్న కూటమి ప్రభుత్వం డ్రైనేజీ నిర్మాణ పనులను తిరిగి పెట్టాలెక్కించింది. ప్రస్తుతం పాలిక్లీనిక్ రోడ్డులో డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
విజయవాడలో వరదల నివారణ - డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళనే మార్గం! - AP Govt Control Floods Vijayawada
పీబీ సిద్ధార్థ కళాశాల పక్క నుంచి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీసు రోడ్డు వరకు కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. 700 మీటర్ల పొడవుగల ఈ డ్రైనేజీ నిర్మాణానికి 90లక్షల రూపాయలు వీఎంసీ సాధారణ నిధుల నుంచి కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 460మీటర్ల వరకు పనులు పూర్తి చేశారు. డ్రైనేజీ మధ్యలో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు తొలగించాల్సి ఉంది. వాటితో పాటు వివిధ కాలనీలకు వెళ్లే రోడ్లు తొలగించి అక్కడా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ రోడ్డులో గతంలో నిర్మించిన డ్రైనేజీ రోడ్డుకంటే ఎత్తులో ఉండడంతో వర్షపు నీరు డ్రైన్ లోకి వెళ్లడం లేదు. ప్రస్తుతం డ్రైనేజీ రోడ్డుకంటే కిందకు నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే రోడ్డు విస్తరణ జరుగుతుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య కొంతమేర తీరుతుంది. డ్రైనేజీ నిర్మాణం పూర్తైతే పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డులో ఉండే వ్యాపారులతో పాటు చుట్టుపక్కల కాలనీల ప్రజలకు మేలు జరుగుతుంది.