Uncollected Tax 160Cr Pending In Vijayawada Municipal Corporation : ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులు సరిపడినన్ని ఉండాలి. పన్నుల వసూల పక్రియ సక్రమంగా జరగాలి. అలా కాకుంటే నిధుల కొరత ఏర్పడి అభివృద్ధి మందగిస్తుంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిస్థితి ప్రస్తుతం ఇలానే తయారైంది. రావాల్సిన పన్నులు దాదాపు 160కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా వసూలు కావడం లేదు.
విజయవాడ నగరపాలక సంస్థలో పన్ను బకాయిలు దశాబ్దాలుగా పేరుకుపోయాయి. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, వ్యాపార సముదాయాల నుంచి రావాల్సిన అద్దెలు ఇలా 160కోట్ల రూపాయలకుపైగా బకాయిలున్నాయి. పన్నులు, వ్యాపార సముదాయాల అద్దెలు చెల్లించలేమని 2011, 2012లో కొంత మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు. కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1150కి పైగా ఇలాంటి కేసులున్నాయి.
వస్త్రలత కాంప్లెక్స్, ఎన్టీఆర్ కాంప్లెక్స్, పటమట వీఎంసీ కాంప్లెక్స్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని వ్యాపార సముదాయాల నుంచి కోట్లాది రూపాయల పన్నులు వసూలు కావాలి. ప్రకటన బోర్డుల ద్వారా రావాల్సిన బకాయిలు 15కోట్లు పార్కులు, పార్కింగ్ స్థలాల నుంచి రావాల్సిన పన్నులు చాలానే ఉన్నాయి. విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉండే ఓ ఫుడ్ కోర్టు కొన్నేళ్ల నుంచి పన్ను చెల్లించడం లేదు. దీని వల్ల నగరపాలక సంస్థకు నిధుల కొరత తలెత్తుతోంది.
రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ - చెత్త పన్ను ఎత్తేసిన చంద్రన్న సర్కార్ - Abolition Garbage Tax in AP
వీఎంసీకి రావాల్సిన పన్నులు, అద్దెల బకాయిల అంశాన్ని ఇటీవల వీఎంసీ కౌన్సిల్‌లో టీడీపీ సభ్యులు లేవనెత్తారు. దశాబ్దాల తరబడి పన్నులు రాబట్టలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ట్రేడ్ లైసెన్సుల పేరుతో రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండడం మంచిది కాదన్నారు.
'తమ నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న వీఎంసీ అధికారులు వ్యాపార సముదాయాలు, ఖాళీ స్థలాలు, ఆస్తి పన్ను చెల్లించని వారి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదు. బకాయిదారులతో ప్రత్యేక చర్చలు జరిపి త్వరగా పన్నులు వసూళ్లు చేయాలి.' - ముమ్మనేని ప్రసాద్, వీఎంసీ కార్పొరేటర్
విజయవాడ అభివృద్ధి చెందాలంటే పన్నులు, అద్దెలు సకాలంలో వసూలు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. అప్పుడే వీఎంసీ అనుకున్న లక్ష్యాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడుతున్నారు. వీఎంసీ అధికారులు త్వరలో ఆ దిశగా చర్యలు చేపడతామని తెలిపారు.
కొత్త బండి కొంటున్నారా? - మీకో బ్యాడ్‌న్యూస్, ఆ వాహనాలకు రోడ్ ట్యాక్స్ పెంపు!