Two Fasting Anganwadi Leaders Shifted to Hospital: అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలో నుంచి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అంగన్వాడీలను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డిమాండ్ల సాధన కోసం గత ఐదు రోజులుగా విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీ సంఘ నాయకులు, అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షలో కూర్చున్న అంగన్వాడీల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. దీక్షలో కూర్చున్న వారిలో శనివారం రాత్రి ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు, ఆదివారం మరో ఇద్దరిని ఆసుపత్రిలో చేర్చారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నా అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు.
ఛలో విజయవాడకు అనుమతులు లేవు: అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారం కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సేకరించిన సంతకాలతో 'జగనన్నకు చెబుదాం' పేరుతో సోమవారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సేకరించిన కోటి సంతకాలను సీఎం జగన్‌కు సమర్పిస్తామని అంగన్వాడీలు పేర్కొన్నారు. అయితే చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. నిబంధనలు అతిక్రమించి కార్యక్రమంలో పాల్గొంటే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. అంగన్వాడీలు చేపట్టే నిరసన కార్యక్రమానికి అనుమతులు లేవని, ఇప్పటికే ఎస్మా కూడా అమల్లో ఉందని సీపీ గుర్తు చేశారు. 506, 120బి తోపాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే మరింత కఠినంగా వ్యవరిస్తామని సీపీ అన్నారు. ముందస్తుగా నేతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి రేపు అంగన్వాడీలు ఎవరూ చలో విజయవాడ కార్యక్రమానికి రావద్దని సీపీ కాంతిరాణా కోరారు.
జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడుతాం - స్పష్టం చేసిన అంగన్వాడీలు
12 మంది అంగన్వాడీలపై కేసు: మరోవైపు అనంతపురం ఉరవకొండలో 12 మంది అంగన్వాడీ వర్కర్లపై కేసు నమోదైంది. మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్న అంగన్వాడీ వర్కర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో అంగన్వాడీలపై ఉరవకొండ తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. 23వ తేదీన ఉరవకొండలో సీఎం జగన్ పర్యటన ఉండటంతో సభాస్థలాన్ని పరిశీలించేందుకు మంత్రిగా పెద్దిరెడ్డి ఉరవకొండ వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కాన్వాయ్‌ను వెళ్లనీయకుండా అంగన్వాడీలు అడ్డుకున్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అంగన్వాడీ కార్యకర్త మృతి- ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న సర్పంచ్