Ap Train Accident Today: రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. గంజాయి మత్తులో వీరు రైలు కింద పడినట్లు రైల్వే పోలీసుల వెల్లడించారు. రైల్వే అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయాల్సి ఉంది.
అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం ఎస్. కె. డి. నగర్ కు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను కొంతకాలంగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అదే విధంగా పద్మావతి నగర్ కు చెందిన మరో యువకుడు యాసిన్ అనే వ్యక్తి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా గంజాయి కి బానిసలైనట్లు స్ఠానికుల కథనం ప్రకారం తెలుస్తుంది. వీరు పలుమార్లు కలిసి గంజాయిని సేవిస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలియజేశారు. పీలేరు పట్టణం నుంచి చిత్తూరుకి వెళ్లే రైలు మార్గంలోని రైల్వే ట్రాక్ వద్దకు ఇరువురూ వెళ్లి ట్రాక్ పై కూర్చొని గంజాయిని తాగుతూ ఉండగా నాగర్ కోయిల్ నుంచి ముంబై వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు ఇరువురిని ఢీకొన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.
గంజాయి మత్తే ప్రాణం తీసింది: ఈ విషయాన్ని గమనించిన లోకో పైలెట్ వెంటనే రైలును హుటాహుటిన నిలిపివేసి సమాచారాన్ని వెంటనే స్థానిక రైల్వే పోలీసులకు అందజేశారు. అయితే అప్పటికే ఈ ప్రమాదంలో యాసిన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అయితే గాయపడిన మరో వ్యక్తి అయిన కిరణ్ కుమార్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలను విడిచినట్లు అధికారులు నిర్థరించారు. అయితే ఈ మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అయిన మహబూబ్ భాషా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపాడు. అయితే మృతి చెందిన యువకుల వద్ద గంజాయి ప్యాకెట్లు విరివిగా లభించినట్లు వారు తెలిపారు. గంజాయి సేవించిన యువకులు గంజాయి మత్తులో ఉండగానే రైలు ఢీకొని ఈ దారుణం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.