Heartbreaking story Of Two Girls : విధి ఆడిన వింతనాటకంలో తల్లిదండ్రులను కోల్పోయారు ఆ ఇద్దరు బిడ్డలు. చిన్ననాడే తల్లినికోల్పోయినా అన్నీ తానై తండ్రి వారిని చూసుకున్నారు. ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో అనారోగ్యం రూపంలో వచ్చిన మృత్యువు వారి బతుకుని ఛిద్రం చేసింది. తండ్రిని ఆ ఇద్దరి బిడ్డల నుంచి దూరం చేసింది. అందరితో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో తండ్రి మరణంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న వారిద్దరికీ ఏదైనా తమ వంతు సాయం అందించాలని సదుద్దేశంతో కొంతమొత్తం నగదును చందాల రూపంలో సేకరించి సాయం చేసి తమ మంచి మనసును చాటుకున్నారు ఆ గ్రామయువత.
వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన చెర్విరాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. వారిది మధ్య తరగతి కుటుంబం. ఇద్దరు ఆడబిడ్డలు. ఉన్నంతలో ఆనందంగా నెట్టుకొస్తున్న వారి జీవితంలో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీనివాస్ భార్య కొవిడ్ సెకండ్ వేవ్‌లో కరోనా బారినపడి మృతిచెందింది. ఆమె ఇద్దరు కుమార్తెలు తల్లి ప్రేమానురాగాలకు దూరమయ్యారు. పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకుని ఆ ఇద్దరి బిడ్డలకు తల్లిలోటు తెలియకుండా పెంచుకుంటూ వస్తున్నారు శ్రీనివాస్. కాగా ఇటీవలే శ్రీనివాస్, అతని తండ్రి ఇద్దరూ అనారోగ్యంతో మంచంపట్టారు.
అండగా నిలిచిన గ్రామ యువత : విధి ఆ కుటుంబంపై పగబట్టిందో ఏమో కానీ శ్రీనివాస్, అతని తండ్రి అనారోగ్యంతో పోరాడుతూ ఈ లోకాన్ని విడిచారు. దీంతో ఆయన కుమార్తెలు సుప్రియ, సుమశ్రీ అనాథలుగా మారారు. తల్లీదండ్రులిద్దరూ మరణించడంతో ఆ ఇద్దరు పిల్లలు తల్లడిల్లిపోయారు. ఆ బిడ్డలను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వారి అలానాపాలనా చూసేవారు లేకుండా పోయారు.
కొందరు మనసున్న మారాజులు ఆ ఇద్దరి బిడ్డలకు తమకు తోచిన సాయమందించారు. గ్రామంలో కొంతమంది యువకులు చందాలు వేసుకుని ఆ ఇద్దరి పిల్లలకు అండగా నిలిచారు. వారు నివసించే ఇల్లు కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో అందులోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో ఒంటరైన ఆ ఇద్దరి బిడ్డల చదవులకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆడబిడ్డలకు ఓ గూడు కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.