Two Bulletproof Buses for CM YS Jagan: ఆర్టీసీ నడుపుతున్న కాలంచెల్లిన డొక్కు బస్సులతో నాలుగున్నరేళ్లుగా ప్రజలు నరకం చూస్తున్నారు. బస్సులు రన్నింగ్‌లో ఉండగానే స్టీరింగ్‌లు, చక్రాలు, యాక్సిల్స్ ఊడిపోవడం, గమ్యస్థానానికి చేరకముందే మార్గమధ్యలో ఆగిపోవడం, బ్రేకులు విఫలమై పొలాల్లోకి, పంట కాల్వల్లోకి దూసుకుపోవడం వంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. అయినా ప్రయాణికుల క్షేమంపై వైసీపీ సర్కారు దృష్టిపెట్టలేదు. కొత్త బస్సుల కొనుగోలుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఆర్టీసీ మాత్రం సీఎం జగన్ కోసం ఏకంగా 20 కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలుచేసింది.
ముఖ్యమంత్రి జగన్ పర్యటనల కోసం ఇప్పటికే ఆర్టీసీ వద్ద రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉండగా, వాటి స్థానంలో కొత్తవి తీసుకుంది. మరో 3 కోట్ల రూపాయలు వెచ్చించి మూడు నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కూడా కొనుగోలుచేసింది. ఇందులో రెండు నాన్ బుల్లెట్‌ప్రూఫ్ బస్సులు ఆదివారం విజయవాడ చేరుకున్నాయి. మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి. మరో 10 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. తర్వాత దాదాపు రెండు నెలలపాటు ఎన్నికల ప్రచారమే ఉంటుంది.
దీంతో సీఎం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేందుకు వీలుగా ప్రజలు టికెట్ల రూపంలో ఆర్టీసీకి చెల్లించిన సొమ్ముతో ఈ బస్సులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల ఆదేశాలతోనే సీఎం పర్యటనలకు వినియోగించే బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుందని, వీటిని వినియోగించుకున్నందుకు ప్రత్యేక టారీఫ్ ఉంటుందని, దాని ప్రకారం సర్కారు ఆర్టీసీకి సొమ్ము చెల్లిస్తుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు - నెలకు ఎన్ని కోట్ల ఖర్చో తెలుసా?
సాధారణంగా సీఎం జగన్ బస్సుల్లో ప్రయాణించేది అతికొద్ది దూరమే.ఏదైనా జిల్లాలో సభ ఉంటే హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడ హెలిప్యాడ్ నుంచి సభా వేదిక మధ్య దూరం గరిష్ఠంగా 5 కిలోమీటర్ల లోపే ఉంటుంది.సభాస్థలికి చేరుకొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను వినియోగిస్తారు. అయితే సీఎం హెలిప్యాడ్ నుంచి సభా వేదికకు చేరుకునే మార్గమంతా బారికేడ్లు ఏర్పాటుచేసి, పరదాలు కట్టేసి, దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటప్పుడు ఉన్నవి వాడుకోకుండా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సీఎం జగన్ భద్రతకు ముప్పుఉందని, పర్యటనలకు రెండు కొత్త హెలికాప్టర్లను సమకూర్చాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ట్విన్ ఇంజిన్‌తో కూడిన ఈ రెండు హెలికాప్టర్లకు నెలకు 3.85 కోట్లు అద్దె చెల్లించనున్నారు. ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి విశాఖ విమానాశ్రయంలో ఉంచనున్నారు. సీఎం జగన్ కాన్వాయ్‌లో వినియోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం గత ఏడాది దాదాపు 15 కోట్లు వెచ్చించారు. 19 టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు కొనుగోలు చేసి, వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్పుచేసి వినియోగిస్తున్నారు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 2019 జూన్‌లో ఆరు టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు కొనుగోలు చేశారు.