Tungabhadra Dam Gate Washed Away : నిర్వహణ లోపం నీటిపారుదల ప్రాజెక్టులకు శాపంగా మారింది. అంతకుముందు అన్నమయ్య డ్యాం, పులిచింతల, గుండ్లకమ్మ, పెద్దవాగు, మూసీ, తాజాగా తుంగభద్ర ఇలా ఏ ప్రాజెక్టు చూసినా నిర్వహణ లోపం కనిపిస్తోంది. ఎంతో శ్రమకోర్చి, వందల, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులకు నిర్వహణ నిధులను ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి. 2, 3 కోట్ల రూపాయల బిల్లులు కూడా రాకపోవడంతో గుత్తేదారులు ముందుకు రావట్లేదు.
తుంగభద్ర ప్రాజెక్టులో గేటుకు, చెయిన్‌కు మధ్య లింకు తెగిపోవడంతోనే గేటు కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడో 1954లో నిర్మించారు. ఇక్కడ గేట్ల నిర్వహణకు చైన్ విధానం ఉంది. గేట్లు ఎత్తేందుకు, దించేందుకు తాడును ఉపయోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. పాతవాటిలో ప్రాజెక్టు గేట్లు చెయిన్‌తో కౌంటర్ వెయిట్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. తలుపు ఎత్తేటప్పుడు చెయిన్ లింకు తెగి, నీటి ప్రవాహ ఒత్తిడి ఒకవైపు పెరిగి తలుపు కొట్టుకుపోయి ఉంటుందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.
స్టాప్‌లాగ్ గేట్ల ఏర్పాటుకు అవకాశం లేదు : ప్రాజెక్టులో గేట్ల జీవితకాలం 45 ఏళ్లే అని గేట్ల రూపకల్పనలో ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. తుంగభద్రలో ఇప్పటికే 70 ఏళ్లపాటు గేట్లు బ్రహ్మాండంగా పని చేశాయని ఎందుకు కొట్టుకుపోయాయంటే ఏం చెబుతామని మరో నిపుణుడు తెలిపారు. ఒక మనిషి జీవితకాలానికి మించి ఉండాలనుకోవడం సరికాదు కదా అని ఆ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఇక్కడ స్టాప్‌లాగ్ గేట్ల ఏర్పాటుకు అవకాశం లేనందున గతంలో కన్నయ్య నాయుడు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్లు తెలిసింది. అవి సాకారం కాలేదు. మరోవైపు ప్రతి ఏటా నిర్వహణ పనులు చేపడుతున్నామని డ్యాం అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది కూడా గ్రీజు పూయడం, ఇతర నిర్వహణ పనులు చేసినట్లు చెబుతున్నా తాజా ఘటనతో నిర్వహణ పనులు, పరిశీలనపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. రుతుపవన కాలం ముందు డ్యాంను పరిశీలించి జాతీయ డ్యాంల భద్రతాసంస్థకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. డ్యాంలో అంతా సవ్యంగానే ఉందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది డ్యాం నిర్వహణ పనులు పకడ్బందీగా చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త చైన్లు ఏర్పాటు చేయాలని నివేదిక : ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టులో గేట్లకు ఏర్పాటు చేసిన చైన్లు మార్చాలని గతంలోనే ఒక ఇంజినీరు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అన్నీ ఒకేసారి మారిస్తే ఆర్థికభారం అవుతుందన్న ఉద్దేశంతో ఐదు గేట్లకు కొత్త చైన్లు ఏర్పాటు చేయాలని ఆయన నివేదించారు. దీనిపై నిపుణులు తాత్కాలిక నివేదిక సిద్ధం చేయగా అప్పట్లో కార్యదర్శిగా ఉన్న అధికారి ఈ ప్రతిపాదన తిరస్కరించినట్లు చెబుతున్నారు. చైన్లపై దృష్టిసారించి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లేది కాదు.
నిర్వహణ సరిగా లేదనే అభిప్రాయం : తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు నీరు గేట్ల పైనుంచి ప్రవహిస్తుండడంతో దీన్ని నివారించడానికి గతంలో గేట్ల ఎత్తు పెంచారు. దీని వల్ల కూడా ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కేంద్ర జలసంఘం తుంగభద్ర డ్యాంను పరిశీలించి స్టాప్‌లాగ్ గేట్లు ఏర్పాటు చేయడం లేదా ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని సూచించినట్లు తెలిసింది. అయితే పియర్స్ కట్ చేసి పని చేస్తే డ్యాంకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సీడబ్ల్యుసీ ప్రత్యామ్నాయం ఉండాలన్నది తప్ప ఎలా ఉండాలో సూచించలేదని ఓ సీనియర్ ఇంజినీర్ చెప్పారు.
గత ఏడాది చెన్నై నిపుణులు పరిశీలించి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని నివేదించినట్లు చెబుతున్నా ఆ నివేదిక వెలుగు చూడాల్సి ఉంది. తుంగభద్ర డ్యాం బోర్డు నిర్వహణలో ఉన్నందున క్రమం తప్పకుండా గేట్ల నిర్వహణ, పెయింటింగ్ జరుగుతుందని, ఈ కారణంగానే తుప్పు పట్టలేదని అక్కడ సుదీర్ఘకాలం పని చేసిన ఇంజినీర్లు చెబుతున్నా ఇటీవల నిర్వహణ సరిగా లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ డ్యాం నిర్వహణ పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు కూడా ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
నాగార్జునసాగర్‌లో ఆరుగేట్లు జామ్ కాగా, గత సంవత్సరం మరమ్మతులు చేశారు. జూరాల గేట్లను పటిష్ఠం చేయాలని చాలా ఏళ్లుగా నిపుణులు సిఫార్సులు చేస్తున్నా ఇంకా జరగలేదు. జూరాలలో ఏడు గేట్లు పటిష్ఠం చేయగా, మరో 62 ఇంకా చేయాల్సి ఉన్నట్లు తెలిసింది. శ్రీశైలంలో గేట్లకు రబ్బర్‌సీళ్లు మార్చడం, పటిష్ఠం చేసే పనికి జగన్ హయాంలో కోటీ 35 లక్షలతో టెండర్ పిలవగా, మూడో టెండర్‌కూ ఎవరూ ముందుకురాలేదు.
వారం రోజుల్లో గేటును ఏర్పాటు చేస్తాం : గేటు కొట్టుకుపోయే సమయానికి తుంగభద్ర ప్రాజెక్టు నిండుగా ఉంది. సామర్థ్యం 105 టీఎంసీలు కాగా క్రస్ట్ స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 టీఎంసీలు నిల్వ ఉంటాయి. గేటు తెగిపోయిన చోట పనులు చేయాలంటే డ్యాంను క్రస్టు స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దాదాపు 61 టీఎంసీలు దిగువకు వదిలేయాల్సిందే. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాలు నిండుగా ఉండటంతో ప్రకాశం బ్యారేజి నుంచి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు.
ప్రాజెక్టులు నిండటంతో కాలువల కింద ఆయకట్టు సాగవుతుందని రాయలసీమ అన్నదాతలు ఆశపడ్డారు. ఇప్పుడు కళ్లముందే విలువైన జలాలు వృథాగా పోతుంటే రైతులు గుండె చెరువవుతోంది. తాగునీటి అవసరాలున్న ప్రజలకు తీవ్ర వేదన మిగిల్చింది. నిరుడు జలాశయం ఒక్కసారి కూడా నిండకపోవడంతో రెండో పంటకు నీళ్లు కష్టమయ్యాయి. ప్రస్తుతం మళ్లీ పెద్ద స్థాయిలో వర్షాలు వచ్చి, డ్యాం నిండుతుందా అన్న చర్చ సాగుతోంది. మొదటి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతాం కానీ, రెండో పంటకు అనుమానమేనని ఇంజినీర్లు చెబుతున్నారు. కాగా గేటుని వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.