Maha Shanti Homam in Tirumala : తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రంపై టీటీడీ శాంతి హోమం నిర్వహించింది. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద యాగశాలలో శాంతి యాగం చేపట్టిన టీటీడీ, మూడు హోమ గుండాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని చేపట్టింది. హోమంలో ఎనిమిది మంది ఆలయ అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఉదయం 5.40 కు శాతుమోరు, మొదటి గంట తర్వాత రెండో గంటలోపు శాంతి హోమం ముగిసింది. వాస్తు హోమం, పాత్రశుద్ది, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు.
టీటీడీ ఈవో శ్యామలరావు శాంతిహోమంలో పాల్గొని సంకల్పం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, జీయర్ స్వాముల పర్యవేక్షణలో శాంతి హోమం, వాస్తు హోమం చేసిన అర్చక స్వాములు శ్రీవారిపోటులో ప్రోక్షణ నిర్వహించారు.
నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు. ప్రోక్షణతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పోటులో అన్న ప్రసాదాల తయారీ నిలిపి వేశారు. ప్రత్యేక గంట తర్వాత పోటు సిబ్బంది శ్రీవారికి అన్న ప్రసాదాలు తయారీ ప్రారంభించారు. శాంతిహోమం తర్వాత అవాహన చేసుకుని ఆ దినుసులను స్వామి వారి దగ్గర పెట్టి అనంతరం కుంభ ప్రోక్షణ అర్చకులు నిర్వహించారు.
పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం: శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ తెలిపింది. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నామని, స్వామివారికి మహానైవేద్యం పూర్తిచేశామని తెలిపింది. ప్రోక్షణతో స్వామివారికి మహానైవేద్యం పూర్తి చేశామని, దోషం కలిగిందన్న భావన లేకుండా ప్రసాదాల తయారీ కేంద్రాల్లో ప్రోక్షణ చేస్తున్నామని, పూర్ణాహుతితో అన్నీ దోషాలు తొలగుతాయని టీటీడీ స్పష్టం చేసింది.
ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశామని, ప్రసాదం కల్తీ జరిగిందని భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ సూచించింది. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని, మార్చిన నెయ్యితోనే ప్రసాదాలు తయారుచేశామని తెలిపింది. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం, పవిత్రోత్సవాలతో పోయిందని పేర్కొంది. ఇకపై లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని, తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, ప్రోక్షణతో పోయాయని టీటీడీ ప్రకటించింది.
TTD EO Shyamala Rao Comments: శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతిహోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు.
మరోవైపు లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. నెయ్యి స్వచ్ఛతని తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్‌ని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తిరుమల లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు తగిన చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గుర్తింపు పొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు తగిన ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నామని ఈవో తెలిపారు. ఎన్ఏబీఎల్ ల్యాబ్‌కి నెయ్యి నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించామని తెలిపారు.
అక్కడ మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుందని వివరించారు. తిరుమలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు శ్యామలరావు ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి 17 వరకు నిర్వహించిన పవిత్రోత్సవాలతో తిరుమల సంప్రోక్షణ అయిందని శ్యామలరావు తెలిపారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
తిరుమలలో నెయ్యి కల్తీపై సిట్ - నేడు శాంతి హోమం - Shanti Homam in Tirumala