Ramana Dikshitulu Criticism Controversy: వరుస వివాదాలు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా సాగుతున్నాయి. మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆలయ వ్యవహారాలతోపాటు టీటీడీ ఈఓపై తీవ్ర విమర్శలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి ప్రతిగా ఉద్యోగులు, అర్చకులు మీడియా సమావేశాలు పెట్టి రమణదీక్షితులపై ప్రతి విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. వివాదాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు భిన్నంగా మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల వివాదాలకు కేంద్రంగా మారుతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ యాజమాన్యం తీసుకొంటున్న నిర్ణయాలు శ్రీవారిని సామాన్య భక్తులకు దూరం చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా తిరుమల ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఈఓతోపాటు ఆలయ వ్యవహారాలపై విమర్శలు చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై ప్రధాన అర్చకులు, టీటీడీ ఉద్యోగులు స్పందించడం వంటి వరుస ఘటనలు తిరుమల ఆలయాన్ని వివాదాల్లోకి లాగాయి.
తిరుమలలో భూఅక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలేవి ?: టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్
వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులపై తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రమణదీక్షితులు వీడియోలు వెలుగులోకి వచ్చాక సంజాయిషీ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకునే దిశగా ప్రయత్నాలు చేయలేదు. ప్రధాన అర్చకులు ప్రతి విమర్శలు చేసేందుకు అనుమతించి వివాదాన్ని మరింత జటిలం చేసింది.
"తిరుమల శ్రీవారి ఆలయంలో ఏవో స్తంభాలు తీసుకువచ్చి పెట్టారని, ఏదో తవ్వకాలు జరిగాయని అనేక రకాలుగా రమణదీక్షితులు అంటున్నారు. వారి గుర్తింపు కోసం, వారి ఇతర ప్రయోజనాల కోసం ఇలాంటి అవస్తవాలు దేవాలయం పైన, స్వామివారిపైన చేయడం చాలా బాధాకరం."- వేణుగోపాల దీక్షితులు, ఆలయ ప్రధానార్చకులు
భూమనా ఇది తగునా? - తిరుమల పార్వేట మండపంలో వైసీపీ ప్రచారం!
ఈవోపై తీవ్ర విమర్శలు చేసిన వీడియోలు వెలుగులోకి రావడం తన వ్యాఖ్యలు వివాదస్పదం అవడంతో సుదీర్ఘకాలం తర్వాత ఆలయానికి వచ్చిన రమణదీక్షితులు మీడియాతో మాట్లాడారు. తనకు ఆ వీడియోలతో ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చారు.
"నేను అలా మాట్లాడడం నా స్వభావం కాదు. నా కల్చర్ కూడా కాదు అది. నేను చేయని దానికి నన్ను బాధితుడ్ని చేస్తే నేనేం చేయలేను." -రమణదీక్షితులు, మాజీ ప్రధానార్చకులు
రమణదీక్షితుల వ్యాఖ్యలపై టీటీడీ స్పందించిన తీరు ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీల తరహలో అర్చకులు మీడియా ముందుకు వచ్చి విమర్శలు, ప్రతి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వివాదానికి అడ్డుకట్ట వేయకుండా టీటీడీ ఉద్యోగ సంఘాలు, ఆలయ అర్చకులు ప్రతి విమర్శలు చేసేలా ప్రోత్సహించడమేంటని మండిపడుతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో వివాదం ముదిరి ఆలయ పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ వైపు సాగుతుండగా మరో వైపు రమణదీక్షితులపై పోలీసు కేసులు పెట్టడం వివాదాన్ని మరింత జటిలం చేస్తోంది.