TTD BOARD Chairman BR Naidu : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీటీడీ పాలకమండలిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసారు. మిత్రపక్షాలైన జనసేన నుంచి ముగ్గురు, కేంద్ర బీజేపీ సూచించిన ముగ్గురికి అవకాశం దక్కింది. బోర్డులో అయిదుగురు మహిళలకు సభ్యులుగా చోటు దక్కింది. తొలిసారిగా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ జస్టిస్‌కు సభ్యునిగా బాధ్యతలు అప్పగించారు. ఒక ప్రవాసాంధ్రునికి కూడా సభ్యునిగా అవకాశం దక్కింది. తొలుత బుధవారం నాడు (అక్టోబర్ 30) 24 మందితో బోర్డును ప్రకటించగా తాజాగా నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 29మంది తో పాలకమండలి ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
టీడీపీలో అంకిత భావంతో పనిచేసిన నన్నూరి నర్సిరెడ్డి, మల్లెల రాజశేఖర్ గౌడ్, వైద్యం శాంతారాం, తమ్మిశెట్టి జానకీదేవి తదితరులకు టీటీడీ సభ్యులుగా పనిచేసే అవకాశం కల్పించారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బిఆర్ నాయుడు) అంచెలంచెలుగా ఎదుగుతూ టీటీడీ బోర్డు ఛైర్మన్ స్థాయికి చేరారు. ఆయన తల్లిదండ్రులు మునిస్వామినాయుడు, లక్ష్మి. బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యోగ సంఘం నాయకుడుగా పని చేశారు. ట్రావెల్, మీడియా రంగాల ద్వారా వ్యాపారవేత్తగా ఎదిగారు.
శ్రేయ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా కాటరాక్ట్ శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సేవలను అందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ ఆయన సేవలు అందించారు. తన ఛానల్ ద్వారా హిందూ ధర్మం, ఆధ్యాత్మిక విలువలను ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేశారు. ప్రతిష్టాత్మక మఠాల పీఠాధిపతులను ఆహ్వానించి చర్చలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు 1983 సంవత్సరంలో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఏర్పడింది.
జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు. దీంతో టీటీడీ సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వైకాపా నుంచి తెదేపాలో చేరి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఆమె టీటీడీ సభ్యురాలిగా, దిల్లీలో స్థానిక టీటీడీ సలహామండలి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఎంఎస్ రాజు మడకశిర ఎమ్మెల్యే, ఎస్సీ వర్గానికి చెందిన యువ నాయకుడు ఎంఎస్ రాజును తెలుగుదేశం అధిష్ఠానం ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయనపై 60 పైగా కేసులు నమోదయ్యాయి.
అక్కిన మునికోటేశ్వరరావు రాజమహేంద్రవరం సమీపంలోని రఘదేవపురానికి చెందిన ఈయన వ్యాపారవేత్త. వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టర్‌గా పని చేస్తుంటారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేశ్ సహా పార్టీ ముఖ్యనేతలు, యువగళం వాలంటీర్లు కోటేశ్వరరావు ఇంట్లో 53 రోజులు బస చేశారు.
సుచిత్ర ఎల్ల భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎల్ల ఫౌండేషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ కొవిడ్ -19 టీకా తయారు చేసి ప్రపంచానికి అందించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆమె టిటిడి సభ్యురాలిగా పని చేశారు. తమ్మిశెట్టి జానకీదేవి మంగళగిరికి చెందిన ఈమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. టీడీపీలో ఉన్న గంజి చిరంజీవి ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. జానకీదేవి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. చేనేత వరానికి చెందిన ఆమె టీడీపీ కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటున్నారు. ఆమె గతంలో భాజపా తరపున అసెంబ్లీకి పోటీ చేశారు.
నన్నూరి నర్సిరెడ్డి తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి టీడీపీలో విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధిగా ఉన్నారు. 1996లో తెలుగు నాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్)లో చేరారు. ఓయూలో టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. నన్నపనేని సదాశివరావు రాజధాని ప్రాంతంలోని దొండపాడుకు చెందిన ఆయన నాట్కో గ్రూపు వైస్‌ఛైర్మన్ దొండపాడు గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారు. నాట్కో తరఫున గుంటూరులోని జీజీహెచ్‌లో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటుకు, జీజీహెచ్‌లో పలు అభివృద్ధి పనులకు సహకారం అందించారు. నాట్కో ట్రస్టులో కీలకంగా వ్యవహరిస్తూ సహాయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు.
జాస్తి పూర్ణసాంబశివరావు హైదరాబాద్‌కు చెందిన ఆయన అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్, సాప్ట్‌వేర్ రంగంలో ఉన్నారు. పనబాక లక్ష్మి, కృష్ణయ్య దంపతులు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలని ఆశించారు. అయితే సమీకరణాల్లో అవకాశం దక్కలేదు. దీంతో లక్ష్మిని టీటీడీ సభ్యురాలిగా నియమించారు. మల్లెల రాజశేఖర్ గౌడ్ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండుసార్లు ఓర్వకల్లు నుంచి జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్తగా గుర్తింపు పొందారు.
జంగా కృష్ణమూర్తి ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ నుంచి తెదేపాలో చేరారు. పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన ఆయన గతంలోనూ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యునిగా పనిచేశారు. వైద్యం శాంతారం చిత్తూరు జిల్లా కుప్పం మండలం వాసనాడుకు చెందిన శాంతారాం తెదేపా కుప్పం క్లస్టర్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌గా వ్యవహరించారు. టీడీపీలో అంకితభావం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బూరగపు ఆనంద్‌సాయి శ్రీకాకుళంకు చెందిన ఆనంద్ సాయి సినీ ఆర్ట్ డైరెక్టర్. చెన్నైలో ఉన్నప్పటి నుంచి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడు. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా పనిచేశారు. యమదొంగ సహా పలు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆలయ వాస్తు, ఆగమశాస్త్ర నిర్మాణాలపై పరిజ్ఞానం ఉంది.
బొంగునూరి మహేందర్‌రెడ్డి తెలంగాణలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు నుంచి అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేస్తున్నారు. యువరాజ్యంలో చురుగ్గా పాల్గొన్నారు. జనసేనలో కీలకంగా వ్యవహరించడంతోపాటు దైవభక్తి ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారసంబంధాలున్నాయి. అనుగోలు రంగశ్రీ విజయవాడకు చెందిన రంగశ్రీ జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె భర్త రత్నం ప్రస్తుతం జనసేన కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. పలు థార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ శ్రీలక్ష్మి నరసింహ హ్యూమన్ రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వెటెన్ ఇన్‌ఫ్రా డైరెక్టర్, విజయనగర కాలనీ మహిళా మండలి ప్రధాన కార్యదర్శి తదితర పదవుల్లో ఉన్నారు.
జస్టిస్ హెచ్‌ఎల్ దత్ 2014 సెప్టెంబరు నుంచి 2015 డిసెంబరు వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అంతకు ముందు కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా, చత్తీస్‌ఘడ్, కేరళ హైకోర్టుల్లో సీజేగా వ్యవహరించారు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్‌గానూ పని చేశారు. కృష్ణమూర్తి వైద్యనాథన్ తమిళనాడులోని చెన్నైకు వైద్యనాథన్ 2015 నుంచి వరసగా టీటీడీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. కంచి కామకోటి మఠం కోఆర్డినేటర్, అథెనా ఎమ్రా పవర్ డైరెక్టర్‌గా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సన్నిహితులు. వైఎస్సార్సీపీ హయాంలోనూ రెండుసార్లు సభ్యులుగా పనిచేశారు.
దర్శన్ ఆర్.ఎన్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ఆయన పారిశ్రామికవేత్త. 20 ఏళ్లుగా కాఫీ ఉత్పత్తి చేస్తున్నారు. ఆర్గానికి సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. సౌరభ్ హెచ్.బోరా మహారాష్ట్రకు చెందిన బోరా 2021, 2023 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వ హయాంలోనూ టిటిడి సభ్యుడిగా పని చేశారు. ఎస్.నరేశ్‌కుమార్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన ఆయన ఈవెంట్ ఇన్‌ఫ్రా, అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ రంగంలో ఉన్నారు. ఏబీవీపీ బెంగళూరు నగర సంయుక్త కార్యదర్శి, కార్యదర్శిగా పనిచేశారు.
డాక్టర్ ఆదిత్ దేశాయ్ గుజరాత్‌కు చెందిన ఈయన కుసుమ్ ధీరజ్‌లాల్‌ఆసుపత్రి ఎండీ, డాక్ ట్యుటోరియల్స్, ఎడ్‌టెక్ యాప్ కోఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ భారత వైద్యమండలి జాతీయ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన భారత వైద్యమండలి మాజీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన కేతన్ దేశాయ్ కుమారుడు. పి.రామ్మూర్తి తమిళనాడులోని కుమారనాథపురానికి చెందిన వారు.
25వ సభ్యుడిగా భానుప్రకాష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా తుడా చైర్మన్, దేవాదాయ శాఖ కార్యదర్శి, దేవదాయ శాఖ కమిషనర్, టీటీడీ ఈవోలతో కలిపి మొత్తం 29మందితో పాలక మండలి జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.
బీఆర్ నాయుడు కృతజ్ఞతలు : టీటీడీ ఛైర్మన్‌గా తనను నియమించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
తిరుమల , తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా నన్ను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
— B R Naidu (@BollineniRNaidu) October 30, 2024
నాపై విశ్వాసం ఉంచి దేవదేవుని సేవ చేసే అవకాశం కల్పించిన ఏపీ
ముఖ్యమంత్రి, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ గారికి, రాష్ట్ర… pic.twitter.com/XK7ULQQoYc
టీటీడీలో ఆ ఇద్దరికే సర్వాధికారాలు- కమిటీలను రబ్బర్ స్టాంపుల్లా "ఏమార్చి"న జగన్ - TTD BOARD
టీటీడీ గత పాలకమండలి నిర్ణయాలపై విచారణ జరపాలి- భానుప్రకాష్ రెడ్డి - TTD Governing Body at YCP Govt