TSRTC Launches 100 Buses : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీని క్షేత్రస్థాయిలో మొదటిగా అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నూతనంగా 100 బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme) కోసం 90 ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రభుత్వం కేటాయించామని తెలిపారు. మరో 10 బస్సులు ఏసీ రాజధాని సర్వీసులను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ పది బస్సులు హైదరాబాద్ నుంచి శ్రీశైలం రూట్లో తొలిసారిగా పరుగులు తీయనున్నాయని అన్నారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ద్వారా సీట్లను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి 1,325 బస్సులను దశలవారీగా వాడకంలోకి తెచ్చేలా ప్రణాళిక చేసింది.
మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు
CM Revanth Reddy Launch New Buses : తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్టీసీ కార్మికులు ఆశించారని రేవంత్(Revanth Reddy) తెలిపారు. గత ప్రభుత్వ హయంలో సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో 36 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెకు దిగినందుకు ఆర్టీసీ కార్మికుల సంఘాలను బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలను ఉచిత బస్సు సదుపాయం కల్పించామని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం నిధులను ప్రతినెలా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించారు. పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో 1000 బస్సులు కొంటామని తెలిపారు.
సిబ్బందిపై దాడి ఘటనలపై ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ - బాధ్యులపై చర్యలు తప్పవని వార్నింగ్
"గత ప్రభుత్వం రూ.2.97 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈసారి అధికారులు రూ.3 లక్షల కోట్లకు పైగా అంకెలతో బడ్జెట్ తయారు చేశారు. వాస్తవంగా అంత నిధులు ఖర్చు చేస్తున్నారా అని అధికారులను భట్టి ప్రశ్నించారు. గత పదేళ్లుగా అవాస్తవ లెక్కలతో బడ్జెట్ రూపొందించామని అధికారులు చెప్పారు. మేం మాత్రం వాస్తవ లెక్కలతో బడ్జెట్ రూపొందించాం. గతేడాది కంటే రూ.15 వేల కోట్లు తక్కువతో బడ్జెట్ రూపొందించాం."- రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
TSRTC New Buses Under Mahalaxmi Scheme : సీఎం రేవంత్ రెడ్డి 100 బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉందని సజ్జనార్ తెలిపారు. తొలిసారి హైదరాబాద్ - శ్రీశైలం రూట్లో బస్సులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. గత సంవత్సరం నవంబర్‌కి రూ.105 కోట్ల నష్టానికి సంస్థ చేరుకుందని, మరికొద్ది నెలల్లోనే లాభాల బాట పట్టనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకంతో 15:50 కోట్ల జీరో టికెట్లకు లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు బాండ్ రూపాయల్లో చెల్లించాల్సిన డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఉచిత బస్సు పథకం - గత 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ప్రయాణం : వీసీ సజ్జనార్
Ponnam Prabhakar on TSRTC New Buses : సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మేడారం జాతరకు 6,000 బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.15 కోట్ల మహిళలు వినియోగించుకున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌ను కలిసిన సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు - విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి