Sajjanar Clarifies TSRTC New Logo Rumors : తెలంగాణ స్టేట్ (టీఎస్)ను, తెలంగాణ (టీజీ)గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ పేరు టీజీఎస్‌ఆర్టీసీగా మారింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాల పేర్లనూ మార్చింది. ప్రయాణికులు తమ సూచనలు, ఫిర్యాదులను ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాల ద్వారా అందించాలని కోరింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ఈ వివరాలను ప్రకటించారు.
TSRTC Changed As TGSRTC : మరోవైపు ఆర్టీసీ లోగో మారినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. కొత్త లోగో ఇంకా సిద్ధం కాలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. తన ఎక్స్ ఖాతాలో ఆర్టీసీ లోగోకు సంబంధించిన విషయంపై వివరణ ఇచ్చారు. నూతన లోగో విషయంలో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదనిపేర్కొన్నారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త చిహ్నాన్ని సంస్థ విడుదల చేయలేదని ఆయన వివరించారు.
యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు : టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న లోగో ఫేక్ అని సజ్జనార్ స్పష్టంచేశారు. దీంతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నూతన లోగోను సంస్థ రూపొందిస్తోందని, యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
TS Change TG : ఇటీవలే తెలంగాణ సర్కార్ ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్ బదులుగా టీజీగానే ప్రస్తావించాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, అటానమస్ విభాగాలన్నింటిలోనూ వెంటనే అమలు చేయాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీ అనే పేర్కొనాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలోనూ టీజీ ఉండాలని చెప్పారు. టీఎస్ అని ముద్రించిన స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్‌ను తొలగించి, టీజీతో కొత్తగా ముద్రించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఉత్తర్వులను అమలు చేసి ఈనెల 31 నాటికి సాధారణ పరిపాలన శాఖకు నివేదిక సమర్పించాలని వివిధ శాఖల కార్యదర్శులను శాంతికుమారి ఆదేశించారు.
ప్రయాణికులకు TSRTC బంపరాఫర్ - రూ.20తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు! - TSRTC Latest Offer