Tribal Women Growing Economically Self Employment: ఒకప్పుడు అడవికే పరిమితమైన మన్యం మహిళలు కాలంతోపాటు మారుతుండటమే కాకుండా స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. తృణ ధాన్యాలు, చిరుధాన్యాలతో పౌష్టికాహార బిస్కెట్లు, పొడులు తయారు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రభుత్వం చేయూతనిచ్చి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే మరింత మందికి ఉపాధిని కల్పిస్తామని గిరిజన మహిళలు అంటున్నారు. గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలపాలనే లక్ష్యంతో 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఏలూరు జిల్లా కోటరామచంద్రాపురంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్ నెలకొల్పింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్న గూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో మహిళలకు బిస్కెట్ల తయారీపై శిక్షణ ఇప్పించింది. బ్యాచ్‌కు 30 మంది చొప్పున 2 బ్యాచ్‌ల్లో 60 మంది మహిళలు బిస్కెట్ల తయారీలో నైపుణ్యం సాధించారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ కేఆర్ పురంలో పూర్తిగా గిరిజన మహిళల ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల యూనిట్‌ను ప్రారంభించింది. రాగులు, జొన్నలు, సజ్జలు, సోయా, పెసలు, అలసంద, మినుములు, ఓట్స్, బెల్లం వంటి పదార్థాలతో ఇక్కడ ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. రాగి, జొన్న, మల్టీగ్రెయిన్ ఇలా పలు రకాల్లో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. వీటితోపాటు తృణధాన్యాల మొలకలతో తయారు చేసే పౌష్టికాహార పొడులకు గిరాకీ ఉంటోంది. వీటికి కావాల్సిన ముడి పదార్థాలను పూర్తిగా గిరిజన మహిళలే తమ పొలాల్లో సాగు చేసి మరీ పండిస్తున్నారు.
పూర్తి సేంద్రీయ పద్ధతిలో బిస్కెట్లు, పొడులు తయారు చేస్తున్నారు. వీటి తయారీతో తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 20 మంది మహిళలు నిత్యం బిస్కెట్లు, పొడులు తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులకు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యమూ కల్పించింది. ప్రభుత్వ వసతి గృహాల పిల్లలకు చిరుతిళ్ల రూపంలో వాటిని అందించింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. ఫలితంగా గిరిజన ఉత్పత్తుల తయారీ యూనిట్ అరకొరగా నడుస్తోంది. వీరికి కేటాయించిన భవనం కూడా పూర్తిగా శిధిలావస్థకు చేరింది.
మేము ఐటీడీఏలో 2016 నుంచి బిస్కెట్ల తయారీ ట్రైనింగ్ తీసుకున్నాం. జొన్న, మల్టీగ్రైన్ బిస్కెట్లు, పౌడర్ తయారు చేస్తుంటాం. కావాల్సిన ముడి పదార్ధాలు మొత్తం రైతులు దగ్గర నుంచే తీసుకుంటాం. మొత్తం 20 మంది పనిచేస్తున్నాం. కరోనా సమయంలో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం చిన్న చిన్న షాపులకు పంపిణీ చేస్తున్నాం. వసతి గదులు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న యూనిట్లో వర్షానికి నీరు కారడంతో ముడి సరుకులు పాడవుతున్నాయి. తమకు మార్కెటింగ్ పెరిగెలా ప్రభుత్వం సాయం చేయాలి. -గిరిజన మహిళలు
వర్షం వస్తే గోడల నుంచి నీరు కారుతోందని ముడిసరుకులు తడిసి పాడవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. సొంత భవనంతో పాటు కొత్త యంత్రాలు సమకూర్చాలని కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు బిస్కెట్లు సరఫరా చేసేలా మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని గిరిజన మహిళలు చెబుతున్నారు. ఒకప్పుడు అమెజాన్ లాంటి ఈ-కామర్స్ సైట్‌ల వేదికగా తమ ఉత్పత్తులను విక్రయించిన గిరిజన మహిళలు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తున్నారు.
ఆదివాసీ దినోత్సవం - గిరిజనులతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం - CM CBN at Tribal Day Celebrations