Triangle Love Story at Machilipatnam in Krishna District : ఓ ప్రియుడు, ఇరువురు ప్రియురాళ్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కృష్ణా జిల్లాలో కలకలం రేకెత్తించింది. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన ఓ యువతిని అదే నగరానికే చెందిన బిల్డర్ విజయ్ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. వారు ఇరువురు కొన్నేళ్ల పాటు సన్నిహితంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదు తీసుకున్నాడు. అనంతరం అతను ఏడాదిగా మొహం చాటేశాడు. ఈ విషయంపై ఆమె ఆరా తీయగా ఇటీవలే కారుణ్య నియామకం ద్వారా కలెక్టరేట్లో ఉద్యోగం పొందిన మరో మహిళతో విజయ్ పరిచయం పెంచుకున్నాడని సదరు మహిళకు సమాచారం అందింది.
ఇద్దరు ప్రియురాళ్ల మధ్య ఘర్షణ : విజయ్ వేరే అమ్మాయితో ఉంటున్నట్లు బాధితురాలు నిర్ధారించుకుంది. కలెక్టరేట్ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న ఆ మహిళకు తను ఇచ్చిన డబ్బుతోనే ఆ ఇంటిని కొనిచ్చాడని బాధితురాలు భావించింది. ఈ క్రమంలో బాధితురాలు అక్కడకు వెళ్లి ఆ మహిళను నిలదీసింది. ఇరువురు మహిళల మధ్య మాటామాటా పెరిగి కలబడుతున్న సమయంలో విజయ్ అక్కడకు వచ్చాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు ఆగ్రహంతో అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న విజయ్ కారుపై తను తెచ్చిన పెట్రోల్ని పోసి నిప్పంటించింది. దీంతో సెల్లార్లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. సెల్లార్లో పార్కు చేసి ఉన్న కార్లకు, జనరేటర్ కు నిప్పు వ్యాపిస్తుందేమోనని స్థానికులు భయపడ్డారు. ఈ క్రమంలోనే మండుతున్న కారును బయటకు తోసేశారు. ఈ ఘటనకు సంబంధించి తనపై దాడికి రావడమే కాకుండా కారు తగలబెట్టే ప్రయత్నం చేసిందంటూ ఈ యువతిపై విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేశారని, ప్రశ్నించినందుకు దాడి చేశారని బాధితురాలు పేర్కొంది. విజయ్, అతని ప్రియురాలి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధిత యువతి సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో ఇరువర్గాల వైపు నుంచి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.
'ప్రేమలో మోసపోయాను'- యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో వైరల్ - LOVE FAILURE