Transfer of Soil from Bhogapuram Airport Lands to Private Ventures : విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయ భూముల్లోని మట్టిని అక్రమంగా ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండతో ఈ తంతు జరుగుతుండటంతో అధికారులు పట్టిపట్టనట్లుగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో అక్రమాలు : విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ పనుల్లోనూ అవినీతి బట్టబయలైంది. సమీపంలో ప్రైవేటు స్థిరాస్తి వెంచర్లకు విమానాశ్రయం భూముల్లోని మట్టిని అక్రమంగా తరలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గూడెపువలస వద్ద భూముల చదును పనులు ఇప్పటికే వేగవంతంగా ప్రారంభించారు. టెర్మినల్ పిల్లర్లకు గోతులు తవ్వుతుండగా భారీ ఎత్తున మట్టి వస్తుంది. దానిని అక్కడే లోతట్టు ప్రాంతాల్లో వేసి చదును చేస్తున్నారు. సుమారు 350 పైగా భారీ వాహనాలు నిత్యం ఇందు కోసం పని చేస్తున్నాయి. ఇదే అదనుగా స్థిరాస్తి వ్యాపారులు జిల్లాలోని కొందరు అధికార పార్టీ నేతల అండతో ఇక్కడి మట్టిని సమీపంలో ఉన్న తమ వెంచర్లకు అక్రమంగా తరలించే కార్యక్రమం చేపడుతున్నారు . లారీ మట్టికి ధర మాట్లాడుకుని 500 నుంచి 1000 లోడ్లు వేసేందుకు అంగీకారం వేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ చెరువు నాది- నీవు తవ్వుకోవడానికి వీల్లేదు! మట్టి అక్రమ తవ్వకాల్లో అధికార నేతల మధ్య బాహాబాహీలు
దర్జాగా మట్టి తరలింపు : అంతర్జాతీయ విమానాశ్రయానికి కేటాయించిన భూమిలో ఎలాంటి పనులు చేపట్టకూడదని, మొన్నటి వరకు చెట్ల ఫలాలు సైతం దించేందుకు వీల్లేదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పట్ట పగలే లారీల్లో మట్టి తరలుతున్న అధికారులు పట్టనట్లు ఉండడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విమానాశ్రయ భూముల్లోకి బయట వ్యక్తులు వెళ్లడానికి కూడా వీల్లేని చోట నుంచి దర్జాగా మట్టి తరలింపునకు పాల్పడుతున్నారు.
అటవీ భూముల్లో మట్టి మాయం- అధికారులకు కనిపించని అక్రమం
పూర్తి స్థాయి విచారణ చేస్తాం - క్రిమినల్ కేసులు తప్పవు : ఇదే విషయంపై స్థానిక తహశీల్దార్ శ్యాం ప్రసాద్‌ను వివరణ కోరగా విమానాశ్రయానికి కేటాయించిన భూమిలో తట్ట మట్టి కూడా తీసుకువెళ్లడం నేరమేనని తెలిపారు. రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు లేకుండా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. వెంచర్లకు తరలించే మట్టిపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు తీసుకోరు - చోద్యం చూస్తారంతే!