Tragedy in Media Mogul Ramoji Rao Hometown Pedaparupudi: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సొంతూరు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ ఊరి నుంచి వెళ్లి దేశం గర్వించే స్థాయికి చేరుకున్న రామోజీరావు ఇకలేరన్న నిజాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి చెందిన వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడున్నా అనుక్షణం పుట్టిన గడ్డ కోసం తపించే మహోన్నత వ్యక్తిత్వం అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుందని అలాంటి వారిలో తమ రామోజీ ఒకరంటూ గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. స్వగ్రామానికి ఆయన చేసిన సేవలు జీవితంలో మరచిపోలేమంటూ కొనియాడారు. ‘జోహార్ రామోజీరావు’ అంటూ గ్రామంలోని అన్ని కూడళ్లలో ఆయన చిత్రపటానికి ప్రజలు నివాళులర్పించారు.
'నా పట్ల మీరు చూపిన అవ్యాజ అభిమానమే నా ఆశకు శ్వాస - ఇక సెలవు' - తెలుగువారికి రామోజీ చివరి లేఖ
ఉమ్మడి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు స్వగ్రామానికి ఎంతో సేవ చేశారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2015 మే 2న కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సొంతూరిని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలోని సమస్యలపై దృష్టి పెట్టారు. విద్య, వైద్యంతో పాటు రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
ఊరిలోని సమస్యలను గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుని అన్నింటినీ పరిష్కరించారు. సొంతూరు అంటే రామోజీరావుకు అమితమైన అభిమానం. అందుకే తన ఊరి ప్రజలు ఏ ఇబ్బందీ పడకుండా ఉండేందుకు ఏమేం కావాలో అన్ని సౌకర్యాలను సమకూర్చారు. గ్రామంలో ఎటు చూసినా రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్ రహదారులు, నూతన భవనాలే దర్శనమిస్తాయి.
స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్న రామోజీ - Media Mogul Ramoji Rao Smruthi Vanam
పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకూ పదహారున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. ఎప్పటి నుంచో గ్రామస్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించారు. రక్షిత మంచినీటి సరఫరా కోసం ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని మట్టి దారులను సీసీ రోడ్లుగా మార్చారు. రెండు శ్మశానవాటికలను అభివృద్ధి చేశారు. వీఆర్‌వో కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దారు. విజయవాడ - గుడివాడ ప్రధాన రహదారితో అనుసంధానించేలా సీసీ రోడ్డు వేశారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించారు.
రామోజీరావుతో కలిసి పెదపారుపూడి పాఠశాలలో చదువుకున్న బాల్య మిత్రులు ఆయన మరణవార్తను తట్టుకోలేకపోతున్నారు. సొంత డబ్బులతో ఊరి కోసం రామోజీరావు ఎంతో చేశారని.. ఈరోజుల్లో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లు అరుదని కొనియాడుతున్నారు. ప్రభుత్వాలు కూడా చేయని ఎన్నో సౌకర్యాలను గ్రామంలో ఆయన కల్పించారంటూ గుర్తుచేసుకుంటున్నారు.
'అక్షరాన్ని ఆయుధంగా మలచుకున్న మహానీయుడు' - రామోజీరావు మృతితో విచారంలో తెలుగు ప్రజలు