Traffic Solution Designed by Kurnool Engineering Students : ఉదయం, సాయంత్ర వేళల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని, త్వరగా ఆఫీసులు, ఇళ్లకు చేరుకోలేక ఎంతో మంది సతమతమవుతుంటారు. కొద్దిదూరం వెళ్లేందుకే ఆపసోపాలు పడుతుంటారు. ఈ సమస్యనే ఎంచుకుని చక్కటి పరిష్కారం కనుగొన్నారు ఇంజినీరింగ్ విద్యార్థులు. ట్రాఫిక్ నిర్వహణ తీరుపై ప్రాజెక్టు రూపొందించారు.
వాహనదారులు, పాదచారులతో కిక్కిరిసిపోతున్నాయి రోడ్లు. రోజురోజుకీ రహదారులపై రద్దీ పెరిగిపోతుండటంతో రాకపోకలు సాగించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 'ఇదేం ట్రాఫిక్' అంటూ విసుగెత్తిపోతున్నారు. అది గమనించిన విద్యార్థులు కర్నూలు సిటీలో ట్రాఫిక్ నియంత్రణను ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. రద్దీ ప్రాంతాలపై అధ్యయనం చేసి ఈ సమస్య నివారించే పద్ధతులు కనిపెట్టారు. కర్నూలు పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు తేజశ్రీ, రత్నశ్రీ, శోభారాణి. ప్రాజెక్టులో భాగంగా కర్నూలు ట్రాఫిక్ సమస్య ఎంచుకున్నారు. పుల్లారెడ్డి కళాశాల నుంచి బళ్లారి చౌరస్తా వరకు ఉన్న మార్గాన్ని, ముఖ్య కూడళ్లను పరిశీలించారు.
అధ్యాపకులు సుస్మిత, సౌజన్య సహకారంతో అధ్యయనం చేసిన సమస్యలు, పరిష్కారాలతో ప్రాజెక్టు పూర్తి చేశారు. ఈ విద్యార్థులు. చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయక పోవడం గమనించామని అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నిళ్లు పనిచేసే చోట ముందుగానే ఒకే సిగ్నిల్ టైమింగ్ ఫీడ్ చేసి ఉండటంతో ట్రాఫిక్ సమస్య మరింత అధికమవుతోందని చెబుతున్నారు. ట్రాఫిక్ యాక్క్యురేట్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ నిర్వహణలో లోపాలు తలెత్తవని అంటున్నారు ఈ విద్యార్థులు. వాహనాల రద్దీని బట్టి ఆటోమేటిక్‌గా పనిచేయడం వల్ల కూడళ్లలో గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరమే లేదని చెబుతున్నారు.
ఐడియా అదుర్స్ - హైడ్రోజన్‌తో నడిచే హైబ్రిడ్ స్కూటీ ఆవిష్కరణ - Hybrid Bike Runs with Hydrogen
'చాలా చోట్ల ట్రాఫిక్ పర్యవేక్షణ సరిగాలేక సామాన్య ప్రజలు తరచూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురై కాలినడకన వెళ్లే వారు పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమస్యలన్నింటిపై అధ్యయనం చేశాం. వీటికి పరిష్కారాలు మా ప్రాజెక్టులో పొందుపరిచాం.' -ఇంజినీరింగ్ విద్యార్థులు
ట్రాఫిక్ యాక్యురేట్ సిగ్నల్స్‌తో పాటు మరో ప్రతిపాదన చేశారు ఈ విద్యార్థులు. సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేసి సైకిళ్లను ప్రోత్సహిస్తే కాలుష్యమూ తగ్గుతుందని సూచిస్తున్నారు. సామాజిక ప్రయోజనమే ధ్యేయంగా తమ విద్యార్థులు ఈ ప్రాజెక్టు చేపట్టారని చెబుతున్నారు అధ్యాపకులు. ట్రాఫిక్ నిర్వహణ సక్రమంగా ఉంటే ఎన్నో ప్రమాదాలు అరికట్టవచ్చని అంటున్నారీ విద్యార్థులు. సామాజిక అంశాలపై అవగాహన కలిగేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నారు.