TPCC Chief Mahesh Kumar Goud On Local Body Elections : పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత, మహేశ్ కుమార్ గౌడ్ మూడు ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. గాంధీ భవన్‌లో శనివారం రోజంతా జరిగిన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నాయకులతో వేర్వేరుగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శలు, ఆయా జిల్లాల ఇంఛార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జిలు పాల్గొన్నారు.
గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలను దగ్గర పెట్టుకుని సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పార్టీ బలాబలాలు ఏవిధంగా ఉన్నాయో ఆరా తీశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జిలు, స్థానిక నాయకత్వాల మధ్య ఉన్న అంతరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటకుంటే భవిష్యత్తు ఎన్నికల్లో టికెట్లు ఉండవని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం మారినా అధికారుల వైఖరిలో మార్పు లేదు : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు స్థానికంగా అధికారులు చెప్పిన మాట వినడం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారినా అధికారుల వైఖరిలో మార్పు రాలేదని ఫిర్యాదు చేశారు. ఏదైనా చేయదగిన పని చెప్పినా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. అదేవిధంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నియోజకవర్గ ఇంఛార్జి ఇందిర మధ్య ఇప్పటికీ విబేధాలు కొనసాగుతున్నట్లు పీసీసీ దృష్టికి రావడంతో, ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడదామని చెప్పినట్లు సమాచారం.
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, నెమెళ్ల శ్రీను మధ్య కూడా సఖ్యత లేనట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని దీపాదాస్ మున్షీ స్పష్టం చేశారని సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా స్థానిక పోలీసు కమిషనర్ తీరుపై పలువురు నాయకులు పీసీసీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా మంది నాయకులు అధికారుల వైఖరి పట్ల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాల్కొండ నియోజక వర్గం పరిధిలో నాయకత్వ వివాదం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ సునీల్ రెడ్డి, మోహన్ రెడ్డిల మధ్య సఖ్యత లేకపోవడం కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకురావడంతో ప్రత్యేకంగా కూర్చొని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.