Actor Hema Clarity on Bengaluru Rave Party : సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ రేవ్ పార్టీలో తాము ఉన్నట్లు వస్తున్న వార్తలను టాలీవుడ్ నటీనటులు శ్రీకాంత్, హేమ ఖండించారు. ముఖ్యంగా కన్నడ మీడియాలో నటి హేమ పేరు మార్మోగిపోతుంది. దీంతో ఆమె స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించారు.
తాము ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు వేరువేరుగా వీడియోలను రికాార్డ్ చేసి రిలీజ్ చేశారు. అందులో నటి హేమ మాట్లాడుతూ, ఇక్కడే ఓ ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. గత రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకెటువంటి సంబంధం లేదని తెలిపారు.
"నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ నా ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. నాపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. అదంతా ఫేక్ న్యూస్. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నా మీద వస్తున్న వార్తలను నమ్మకండి."- హేమ, టాలీవుడ్ నటి
Hero Srikanth Clarify on Rave Party : అదేమాదిరిగా హీరో శ్రీకాంత్ స్పందిస్తూ, తాను రేవ్ పార్టీలో పాల్గొన్నాననే ప్రచారం అవాస్తవమన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లలేదని చెప్పారు. ఇందులోకి అనవసరంగా తమను లాగుతున్నారని, తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇరువురు కొట్టిపారేశారు. కాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఇప్పటికే పలువురు తెలుగు నటులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
"చాలా సామాజిక మాధ్యమాల్లో నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు చూపిస్తున్నారు. అది నేను కాదు. నా మాదిరిగానే ఎవరో ఉంటే నేనని తప్పుగా చెప్పారు. ఈమధ్య నా భార్యతో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇప్పుడేమో ఇలా. రేవ్ పార్టీకి వెళ్లే కల్చర్ నాది కాదు. దయచేసి ఎవరూ ఈ విషయాన్ని నమ్మొద్దు."-శ్రీకాంత్, టాలీవుడ్ నటుడు
అసలేం జరిగిందంటే : బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఓ వ్యాపారవేత్త ఇచ్చిన పార్టీలో ఏపీ, బెంగళూరుకు చెందిన వందమందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు, పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నారన్నారు. రేవ్ పార్టీలో పోలీసులు డ్రగ్స్ గుర్తించారు.
17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్ గుర్తించిన పోలీసులు, మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్‌ను సైతం గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.